ప్రస్తుతం ప్రపంచాన్ని శాసించే దిశగా పయనిస్తున్న అత్యాధునిక సాంకేతికత కృత్రిమ మేధ (AI) యుగంలో జీవిస్తున్నాం. ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న దాదాపు ప్రతి సాధనం (సాఫ్ట్వేర్) ఏఐ వెర్షన్‌ను అందిస్తూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒక సర్వే ప్రకారం, ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు ఏదో ఒక రూపంలో ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారట! ఒక్క ఏఐ అనే కాదు ఏ సాంకేతికత అయినాసరే దాన్ని‘మానవాళికి వరం’ అంటూ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు! అయితే, ప్రతివ్యక్తికీ మోసగించే ప్రవృత్తి కూడా ఒకటి ఉంటుందని మరోపక్క శాస్ర్తాలు హెచ్చరిస్తున్నాయి! ఇలాంటి పరిస్థితుల్లో, మనం ఏఐని సంపూర్ణంగా విశ్వసించగలమా?
భగవద్గీత ప్రకారం, ప్రతీ ఆవిష్కరణ భగవంతుడు ప్రేరేపించిన బుద్ధితో ప్రకృతిలో సూక్ష్మ నియమాలను కనుగొనడం ద్వారా లభిస్తుంది. ప్రతి సాంకేతిక ఆవిష్కరణ ఒక కత్తితో పోల్చదగినది. ఒక వైద్యుడు కత్తిని ఉపయోగించి ఆపరేషన్ చేసి వ్యక్తి ప్రాణాలను కాపాడగలడు. ఒక దుర్మార్గుడు అదే కత్తిని మరోవ్యక్తి ప్రాణాలను తీసేందుకూ ఉపయోగించగలడు. కాబట్టి, ఇక్కడ ప్రశ్న కత్తి మంచిదా, చెడ్డదా అని కాదు. దాన్ని ఎలా ఉపయోగిస్తారన్నదే అసలు విషయం. అదే విధంగా, ఏఐ సాంకేతికత స్వతహాగా మంచిదికానీ చెడ్డదికానీ కాదు. దాన్ని ఎలా ఉపయోగిస్తారన్నదే ముఖ్యం. ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించేందుకా, లేదా ధనికులుగా మారేందుకా! భగవత్ సంబంధితమైన సాంస్కృతిక విలువలను ప్రోత్సహించి సమాజంలో మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించేందుకా?
కృత్రిమ మేధస్సు (AI), అణుశక్తి, ఇతర శక్తిమంతమైన సాంకేతికత ఏదైనా సరే, దానిని కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే కలిగే దుష్పరిణామాలను గురించి హరేకృష్ణ ఉద్యమ సంస్థాపక ఆచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు తమ భగవద్గీత భాష్యంలో స్పష్టంగా హెచ్చరించారు. భౌతిక ప్రపంచంలో సాధ్యమైనంత వరకు సుఖం అనుభవించాలని ప్రయత్నిస్తూ, ఇంద్రియ సుఖాల కోసం ఏదో ఒక కొత్త దాన్ని కనిపెట్టడంలోనే వాళ్లు ఎల్లప్పుడూ నిమగ్నులై ఉంటారు. అలాంటి భౌతిక పరిశోధన ఫలితాలు మానవ నాగరికత పురోభివృద్ధిగా పరిగణించినప్పటికీ, ప్రజలు రోజురోజుకూ హింసాప్రాయులుగా, క్రూరులుగా తయారవుతున్నారు. జంతువుల పట్ల, సాటి మనుషుల పట్ల హింసా ప్రవృత్తిని పెంచుకుంటున్నారు. తోటి జీవులతో ఎలా మెలగాలో వారికి తెలియడం లేదు. తమ పరిశోధనల ద్వారా అందరికీ వినాశనాన్ని చేకూర్చే వస్తువులను కనిపెట్టే వాళ్లు ప్రపంచానికి శత్రువులుగా పరిగణన పొందుతారు. (భగవద్గీత 16.9 భాష్యం)
ముందుగా చెప్పుకొన్నట్టు, ఏఐ సాంకేతికతను తమను తాము గొప్పవారిగానో, అత్యంత సంపన్నులుగా మార్చుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తే, సమాజంలో క్రూరత్వం పెరుగుతుంది. ప్రజలకు ఒకరిపట్ల మరొకరు ఎలా ప్రవర్తించాలో తెలియకుండా పోతుంది! స్వార్థ ఆశయాలను సాధించడానికి ఎంతదాకైనా వెళ్లడానికి వెనుకాడరు! ఈ స్వార్థపూరిత దృక్పథమే ప్రపంచంలో అన్ని రకాల నేరాలకు, దుఃఖాలకు, మానసిక రుగ్మతలకు మూలకారణం. బలవంతుడు బలహీనుడిని అణచి వేస్తాడు! ఆధునిక సమాజంలో ఇప్పటికే మనం వీటన్నిటినీ చూస్తున్నాం.
ఏఐ సాంకేతికత తటస్థంగా ఉండగలదేమో, కానీ దుర్మార్గుల చేతిలో ప్రతిదీ క్రూరంగానే పనిచేస్తుంది! ఇందుకొక ఉదాహరణగా ఇటీవలే, ఒక ఏఐ చాట్‌బాట్ ఓ 17 ఏళ్ల బాలుడికి, అతని తల్లిదండ్రులు మొబైల్ స్క్రీన్ టైమ్ తగ్గించాలని సూచించినందుకు వారిని హత్య చేయమని సలహా ఇచ్చింది! ఇలాంటి సంఘటనలను బట్టి, ప్రముఖ కంపెనీల ఏఐ సాధనాలు పూర్తిగా నిష్పాక్షికంగా, స్వార్థరహితంగా ఉంటాయా అనేది సందేహమే!
భగవద్గీత ప్రకారం, ప్రపంచంలో అన్ని సమస్యలకు మూలకారణం భగవద్విముఖత (దైవభావం లేకపోవడం). భగవంతుడిని విశ్వసించకుండా, సృష్టికి గల మూలకారణాన్ని గ్రహించక, భక్తితో శరణు వేడలేరు. ఈ భౌతిక ప్రపంచం వెనుక గల ఆ స్థితికారకుడైన శ్రీకృష్ణుని పాత్రను గుర్తించలేరు. ఏది మంచో, ఏది చెడో తెలుసుకోవాలని ప్రయత్నించరు. అంతిమంగా, ఏ మార్గమైనా సరైనదేనని అనుకుంటారు!
హరేకృష్ణ ఉద్యమ వ్యవస్థాపకులు, విశ్వగురు శ్రీల ప్రభుపాదుల వారు పేర్కొన్నట్టు, ఈ లోకం ప్రజల అవసరాలను తీర్చగల వనరులతో స్వయం సమృద్ధి అయి ఉంటుంది. కానీ, ఈ లోకంలో కొరతల్లా కేవలం కృష్ణ చైతన్యమే! భగవత్ చైతన్యంతోనే శాంతి, సౌభాగ్యాలతో కూడిన సమగ్ర అభివృద్ధి సాధ్యం. జీవులలో కృష్ణ చైతన్యం ఉదయించినపుడు, తమ హృదయాలు కారుణ్యంతో నిండిపోతాయి. అప్పుడు కేవలం తోటి మానవులకే కాదు, జంతువులకూ సాయపడాలనే భావన కలుగుతుంది. కృష్ణ చైతన్యంతో మాత్రమే ‘వసుధైక కుటుంబం’ అన్న విశ్వ సామరస్యతను, సౌభ్రాతృత్వాన్ని సాధించగలం. లేదంటే, ప్రతిఒక్కరిలో గొప్పవాడిని కావాలంటూ ఒక అసహనపూర్వకమైన పోటీ పెరుగుతుంది. అప్పుడు ఏఐ, అణుశక్తి వంటి శక్తిమంతమైన సాంకేతికతలు వినాశనానికే దారితీస్తాయి. ప్రపంచంలో శాంతి, సంతృప్తి పూర్తిగా కనుమరుగైపోతాయి. కానీ, అదే ఏఐ సాంకేతికతను మంచిని బోధించేందుకు వినియోగిస్తే ప్రపంచమంతటా ఆనందభావన నెలకొంటుంది. అప్పుడే కృత్రిమ మేధకైనా, మరో అధునాతన సాంకేతికతకైనా పరిపూర్ణత చేకూరుతుంది!
హరే కృష్ణ!