TTD | వైకుంఠ ఏకాదశికి టీటీడీ స్థానిక ఆలయాలు ముస్తాబయ్యాయి. జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు కృష్ణస్వామివారిని ముఖమండపంలో అమ్మవారి ఉత్సవరులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరుగనున్నది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాయించనున్నారు. ఈ క్రమంలో ఆలయంలో కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, అష్టదళ పాదపద్మారాధన సేవలను టీటీడీ రద్దు చేసింది. జనవరి 3న ఉదయం 7 నుంచి 9 గంటల వరకు సుదర్శన చక్రత్తాళ్వార్‌కు తిరుమంజనం, చక్రస్నానం జరుగనుంది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామున 12.05 గంటల నుంచి 2 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. వేకువజామున 2 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు. ఈ సందర్భంగా 2న ఆర్జిత కల్యాణోత్సవం రద్దు కానున్నాయి. అదేవిధంగా 3న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4 నుంచి 6 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు చక్రస్నానం నిర్వహించనున్నారు.
అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 3 నుంచి 4 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు. 3న ద్వాదశి సందర్భంగా ఉదయం 7 నుంచి 8 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు.
నారాయణవనంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామున 2 నుంచి 4 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీవారి గ్రామోత్సవం, ఆస్థానం నిర్వహించనున్నారు. 3న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 8.15 గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం కల్పిస్తారు.
నాగలాపురం శ్రీ వేద నారాయణస్వామివారి ఆలయంలో జనవరి 2న వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని వేకువజామున 2 నుంచి 4 గంటల వరకు తిరుపాల్లచ్చితో స్వామివారిని మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఉదయం 10 గంటలకు ఉత్సవర్లకు అభిషేకం, సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. అదేవిధంగా తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయం, కోదండరామాలయం, చంద్రగిరిలోని కోదండరామాలయం, కార్వేటినగరంలోని వేణుగోపాలస్వామివారి ఆలయం, పిఠాపురంలోని పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కీలపట్ల కోనేటిరాయస్వామివారి ఆలయం, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతిలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.