తిరుమల : ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు తిరుమల ( Tirumala ) లోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం( Salakatla Jyeshtabhishekam ) జరుగనుందని ఆలయ అధికారులు వెల్లడించారు. జ్యేష్టాభిషేకం సందర్భంగా ఈనెల 28 కళ్యాణోత్సవం ( Kalyanotsavam ) , ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును అభిద్యేయక అభిషేకం అని కూడా అంటారని వెల్లడించారు.
తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. మొదటిరోజు శ్రీ మలయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహించిన తరువాత స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారని వివరించారు.
రెండవరోజు ముత్యాల కవచం , మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారని తెలిపారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారని వెల్లడించారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు.