తన జీవితకాలంలో ఒక్కసారైనా కాశీ వెళ్లి రావాలని ఒక వృద్ధురాలికి కోరికగా ఉండేది. చాలాసార్లు ఆ విషయం మనవడితో చెప్పింది. అతను ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునే వాడు. గట్టిగా అడిగినప్పుడు ఊర్లోని శివాలయానికి తీసుకుని వెళ్లేవాడు. ‘కాశిలో అయినా, మన ఊర్లో అయినా దేవుడు ఒక్కడే కదా.
‘కాశికి పోగానే కర్రె కుక్క.. కపిల గోవు కాద’నే సామెత వినలేదా’ అని సర్ది చెప్పేవాడు. ఓ శనివారంనాడు పొలం పనులు చూసుకుని వచ్చిన మనవడితో మళ్లీ కాశీ యాత్ర ప్రస్తావన తెచ్చింది అవ్వ. ‘కాశి కథ తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి మన ఊరి గుడికి వెళ్లి వద్దాం’ అంటూ గబగబా వెళ్లి స్నానం చేశాడు. తమ తోటలో కాసిన అరటిపండ్లను కొన్ని చేతిలోకి తీసుకుందామె. ఆకలిగా ఉందని మనవడు అడిగితే ఒక పండు ఇచ్చింది. అరుగుపైన కూర్చుని శుభ్రంగా తోలు తీసి తిన్నాడు. మిగిలిన పండ్లతోపాటు పూలు, టెంకాయ తీసుకుని గుడికి వెళ్లారు. పూజారి.. పూజ పూర్తిచేసి కొన్ని పూలు, అరటిపండు, కొబ్బరిచిప్ప అవ్వ చేతికిచ్చాడు. ఇద్దరూ గుడి దగ్గరే కూర్చున్నారు. ‘నీకు ఇంకా ఆకలి తీరలేదేమో, ఈ అరటిపండు కూడా తిను’ అని పండు మనవడి చేతికి ఇచ్చింది. అప్పటి దాకా కూర్చున్నవాడు భయం, భక్తితో లేచి నిలబడి అరటిపండును కళ్లకు అద్దుకుని తినడం ప్రారంభించాడు.
ఆమె నవ్వి ‘ఇంట్లో అరటిపండును మామూలుగా తిన్నావు, ఇక్కడ కళ్లకు అద్దుకుని తింటున్నావేం?’ అని అడిగింది. ‘ఇంట్లో తిన్నది మామూలు పండు. ఇక్కడ తిన్నది స్వామివారి ప్రసాదం కదా’ అని బదులిచ్చాడు. ‘అరటిపండు మామూలుగా తినేస్తే పండే. అదే దేవుడి ముందర పెట్టి తింటే ప్రసాదమని గుర్తించావు. మన ఊరిలో ఉన్నది కూడా దేవుడే. కానీ కాశి అంత పుణ్యక్షేత్రం కాదు కదా. నా జీవితకాలపు కోరిక తీర్చకూడదా’ అని కోరింది. ‘నిజమే.. స్థల ప్రాశస్త్యం, ఎంతో చరిత్ర ఉన్నది కాశి. అవ్వను తీసుకెళ్లాలి. పుణ్యక్షేత్ర పర్యటనలు పాపాల్ని పరిహరిస్తాయి కదా’ అని మనవడికి అవగాహన అయ్యింది. నెల తర్వాత అవ్వామనవడు ఇద్దరూ కాశీ వెళ్లి, గంగానదిలో స్నానం చేసి, విశ్వనాథుని దర్శనం చేసుకుని వచ్చారు.