‘శ్రీమాత్రే నమః’ అనగానే లలితా సహస్ర నామాలే గుర్తుకువస్తాయి. అయితే లలితా సహస్ర నామాలు స్తోత్రంగా ఉండే ఒక శాస్త్రం. ఇవి జీవితాంతం స్మరణం చేసుకోవాల్సిన ప్రాధాన్యం కలిగినవి. వేయి నామాలు అయినప్పటికీ అన్నింటిలో ఉన్నది ఒక్క అమ్మవారే. కాకపోతే అనేక రూపాలతో అవతరించి అనుగ్రహిస్తుంది. ఇక ఈ నామాలను కూర్చింది వశిన్యాది వాగ్దేవతలు. మణిద్వీపంలో దేవతలు, మునులు, రుషులు, సృష్టి, స్థితి, లయ కారకులు, అమ్మవారి పరివార దేవతలు, ఉపదేవతలు సమావేశమై ఉన్నప్పుడు ఆ తల్లి నుంచి ఎనిమిది కిరణాలు వెలువడ్డాయి. అవి ఎనిమిది విభిన్న దేవతల స్వరూపాలు ధరించి అమ్మవారికి నమస్కరించాయి. అమ్మవారి నుంచి వెలువడిన కిరణాల నుంచి వచ్చారు కాబట్టి, వీరంతా ఆ తల్లి శక్తులే. లోకాన్ని అనుగ్రహించాలనే తలపుతో అమ్మవారి సంకల్ప మాత్రంచేత వెలువడిన వశిన్యాది వాగ్దేవతలు వీరే.
దుర్గ, లక్ష్మి, సరస్వతి.. త్రిశక్తులు అమ్మవారి స్వరూపమే. కాబట్టి అమ్మవారి సరస్వతీ శక్తి నుంచి ఈ ఎనిమిది మంది వాగ్దేవతల రూపాలతో వెలువడ్డారు. సంస్కృత భాష వర్ణమాలలోని ‘అ’కారం నుంచి ‘క్ష’కారం వరకు మొత్తం ఎనిమిది వర్గాలు ఉంటాయి. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క అధిదేవత ఉంటుంది. ఆ అక్షర అధిదేవతలే అమ్మవారి నుంచి వెలువడిన వశిన్యాది వాగ్దేవతలు. అమ్మ ఆ దేవతలకు ‘లోకానికి నా గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి. నాలోని అక్షర రూపమే మీలా అవతరించింది. కాబట్టి నా వైభవాన్ని మీరు కీర్తించండి. మీరు ఆవిష్కరించిన జ్ఞానాన్ని ఇక్కడున్న రుషులు, దేవతలు గ్రహించి పొందుపరచుకొని సాధన చేస్తూ ప్రపంచానికి అందజేస్తారు’ అని ఆజ్ఞాపన ఇచ్చింది. అలా అమ్మవారిని స్తుతిస్తూ వారు లోకానికి ప్రసాదించిందే లలితా సహస్ర నామ స్తోత్రం.
శ్రీచక్రం అమ్మవారి రూపం. అందులో బిందువు దగ్గర అమ్మవారు ఉంటుంది. మొదట ఆ బిందువు విచ్చుకోగానే త్రికోణంగా వస్తుంది. తర్వాత ఎనిమిది త్రికోణాలు, ఆ తర్వాత పది త్రికోణాలు, దాని తర్వాత మరో పది త్రికోణాలు, అలా పద్నాలుగు త్రికోణాల వరకు బిందువు విచ్చుకుంటుంది. చివరికి మూడు సమాంతర రేఖలు కలిగిన చతురస్రం వస్తుంది. బిందువు నుంచి మూడోది అష్ట త్రికోణ చక్రం. ఎనిమిది త్రికోణాలు ఉన్న ఈ ఆవరణకు సర్వరోగ హర చక్రం అని పేరు. బిందువు, త్రికోణం, అష్ట త్రికోణం ఈ మూడు ఆవరణలు కలిపితే మహాశక్తి. ఈ ఎనిమిది కోణాల దగ్గర ఉండేది వశిన్యాది దేవతలు. ఈ దేవతలను ప్రార్థిస్తే మన దేహం, మనసులో ఉన్న అన్ని రోగాలు పోతాయి. వీరు కేవలం వాగ్దేవతలే కారు. సర్వరోగాలను పోగొట్టే నాదశక్తులు. అలాంటి నాదశక్తులు మంత్రాలకు మూల దేవతలు. మంత్రం ఏదైనా సరే అది అక్షరాల సమాహారమే. ‘మీరు నా చక్ర విజ్ఞానం తెలిసినవారు. ఎప్పుడూ నా నామ పారాయణం చేసేవారు. నా స్తోత్రాన్ని నాకు అంకితంగా సహస్రనామ స్తోత్రం చేయండి’ అని అమ్మవారు వశిన్యాది దేవతలను ఆజ్ఞాపించింది. అలా వారి నోటినుంచి అమ్మవారికి అంకితంగా వెలువడిందే లలితా సహస్ర నామ స్తోత్రం.
లలితా సహస్ర నామాలు రహస్య నామాలు. అంటే రహస్యంగా చదువుకోవడం అని అర్థం కాదు. వీటి అర్థాలు ఏ నిఘంటువులలో దొరకవు. జగన్మాతకు ఆదీ, అంతమూ లేవు. అంటే ఈ చరాచర సృష్టికి అమ్మవారే ఆధారం. అందువల్ల లలితా సహస్ర నామాలను స్పృహతో అర్థం చేసుకుంటూ చదవితే మనకు జ్ఞానం వస్తుంది. వీటిలో అమ్మవారిని గురించి సంపూర్ణంగా వర్ణించారు. ఇందులో మొదటి నామం ‘శ్రీమాత’. జపమాలలో మేరుపూస ఉంటుంది. మాలను తిప్పే సమయంలో మేరుపూస నుంచి మొదలుపెడతారు. మళ్లీ అక్కడికే చేరుకుంటారు. అలానే లలితా సహస్ర నామాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మణిపూస అనుకుంటే, శ్రీమాత మేరుపూస. శ్రీమాత నామం మొదటిదే కాక ప్రధానమైంది. లలితా సహస్ర నామాలనే చెట్టుకు శ్రీమాత విత్తనం లాంటిది. ‘శ్రీమాత్రేనమః’ అనగా అమ్మవారిని ఆశ్రయించడం. సహస్ర నామాల్లో ప్రతి నామానికీ అమోఘమైన శక్తి ఉంటుంది. తెలుసుకొని పఠిస్తే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది.
వేముగంటి శుక్తిమతి
99081 10937