శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో అమావాస్య సందర్భంగా అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి గురువారం ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ విభూది గంధ జలాలు, బిల్వోదక సుగంధద్రవ్యాలు, శుద్ధ జలాలతో అభిషేకాలు విశేష పుష్పార్చన, మహా నైవేద్య కార్యక్రమాలు ఈవో లవన్న ఆధ్వర్యంలో నిర్వహించారు.
లోక కల్యాణార్థం ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో స్వామివారికి అభిషేకార్చనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరుబయట ఆలయంలో దర్శనమిచ్చే స్వామిని పూజించడంతో భూతప్రేతాలు, గ్రహదోషాలు తొలగుతాయని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ప్రధాన అర్చకుడు భద్రయ్య తెలిపారు. ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజుల్లో సేవాకర్తలు తమ గోత్రనామాలను srisailadevasthanam.org వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని ఈవో కోరారు.
గురువారం ప్రదోషకాల పూజలో 49 మంది భక్తులు పరోక్ష సేవలో పాల్గొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని శ్రీశైల టీవీ ఛానల్ సాంఘీక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా.. పూర్తి వివరాల కోసం కాల్సెంటర్ 8333901351, 2, 3, 4, 5, 6 నంబర్లలో సంప్రదించాలని కోరారు. అదేవిధంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలోని త్రిఫల వృక్షం వద్ద కొలువైన దత్తాత్రేయస్వామికి గురువారం ప్రత్యేక పూజలు అభిషేకార్చనలు నిర్వహించారు.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఆధోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్య దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి అర్చక వేదపండితులు తిలకధారణ చేయగా అధికారులు పూలమాలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేదాశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రం, ఙ్ఞాపికను అందజేశారు.