ప్రతి భర్త తన భార్య, పిల్లలకు తగిన రీతిలో అన్నవస్ర్తాలను సమకూర్చి పోషించాల్సి ఉంటుందని దివ్య ఖురాన్లో అల్లాహ్ సెలవిచ్చారు. బానిస స్వేచ్ఛ కోసం ఖర్చు పెట్టిన దీనార్ కన్నా, అభాగ్యుడికి దానం చేసిన దీనార్ కన్నా ఆలుబిడ్డల పోషణ కోసం ఖర్చు పెట్టిన దీనారే అత్యంత పుణ్యప్రదమైనదని దైవ ప్రవక్త (స) బోధించారు. అయితే ఈ బోధనలు తక్కువ ఆదాయం కలవారికి మాత్రమే వర్తిస్తాయి. అధిక ఆదాయం కలవారు భార్య పిల్లల పోషణ తర్వాత మిగిలిన మొత్తాన్ని జకాత్ (దానం) చేయవచ్చు.
భార్యా పిల్లలను పోషించడం పురుషుల విధి. దాన్ని విస్మరించి స్వచ్ఛంద దానధర్మాలు చేయడం వల్ల లాభం ఉండదు. తల్లిదండ్రులు కడుపు తీపితోనే సంతానంపై ఖర్చు పెట్టినా.. దానికి దేవుడు ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆలుబిడ్డల పోషణలో నిర్లక్ష్యం వహించడం మహాపాపం. మన ఖాతాలో ఇదొక్క పాపమే ఉన్నా ప్రళయ దినాన దేవుడు మనల్ని అందుకు కఠినంగా శిక్షిస్తాడు. ‘ఇచ్చే చెయ్యి పుచ్చుకొనే చెయ్యి కన్నా శ్రేష్ఠమైనది. నీ సంపాదనలో మొదట నీపై ఆధారపడి ఉన్నవారికి ఖర్చుపెట్టు. వారి అవసరాలన్నీ తీరిపోయాక చేసే దానమే అత్యుత్తమ దానం’ అని దైవ ప్రవక్త (సల్లం) ఉద్బోధించారు.
– ముహమ్మద్ ముజాహిద్96406 22076