శుకుడు పరీక్షిత్తుతో.. రాజా! మరునాటి వరువాత- ప్రాతఃకాలం అక్రూరుడు, బలరామకృష్ణులు ఇరువురినీ మథురకు తీసుకురావడానికి తేరు (రథం)లో గోకులానికి చేరుతూ, తెరువు- దారిలో ఈ తీరుగా మనసులో తలచాడు.
ఉ॥ ‘ఎట్టి తపంబు సేయబడె? నెట్టి చరిత్రము లబ్ధమయ్యెనో
యెట్టి ధనంబు లర్హులకు నీ బడెనో తొలిబామునందు నా
యట్టి వివేక హీనునకు నాది మునీంద్రులు యోగదృష్టులం
బట్టగలేని యీశ్వరుని బ్రహ్మమయున్ హరి జూడగల్గెడిన్’
పూర్వజన్మలో నేను ఎట్టి అపూర్వమైన తపస్సు చేశానో! ఎలాంటి సత్ప్రవర్తనతో శుభకర్మలు ఆచరించానో! యోగ్యులైన వారికి ఎటువంటి భోగ్య పదార్థాలు- ధనధాన్యాలు దానం చేశానో కదా! నారదాది ఆద్యులైన మునీంద్రుల యోగదృష్టికి కూడా అగోచరుడైన భగవంతుని, ఖగరాజ (గరుడ) గమనుని, జగత్పతి శ్రీకృష్ణుని- ఏకరూపుడైనా అనేకమూర్తిని, వివేక- తత్తజ్ఞాన శూన్యుడనైన నేను కనగలగడం విచిత్రం, విన విడ్డూరం కాదా? ఆ సారసాక్షుని- పద్మనేత్రుని, అనంతుని ఛద్మ (కపట) బుద్ధితో అంతం చేయడానికి తన సద్మ- గృహానికి (చెంతకు) తెమ్మని నన్ను పంపిన కంసుని వంటి చెలికాడు తలపోయగా నాకు ఇలలో మరొకడు కలడా? క్రూరుడైన కంసుని పంపుచే నన్ను హింసించడానికి వచ్చిన తెంపరి (సాహసికుడు), దుర్గార్గుడని వారిజాక్షుడు శౌరి నన్ను కనగానే అనుమానిస్తాడో! లేక తనను మదిలో సదా పదిలంగా నిలుపుకొన్న వాడని తెలిసి యదుసింహుడు భూరి కృపతో అభిమానిస్తాడో! నా భాగ్యం ఎలా ఉందో కదా! ఇలా బహువిధాల నందనందనుని సందర్శనం కోరుతూ సుందరమైన స్యందనం- రథం అధిరోహించి అక్రూరుడు సాయంకాలానికి బృందావనం సమీపించాడు.
బమ్మెరవారు అందంగా వెలయించిన, గ్రీష్మంలో తెమ్మెర- మలయమారుతం లాంటి వీనుల విందైన ఈ కంద పద్యంలో బృందావన శోభను కన్నులపండువుగా కందాము…
క॥ ‘ముందట గనె ఘన చందన
కుంద కుటజ తాల సాల కురవక వట మా
కందన్ వందిత బల గో
విందన్ వికచారుణార విందన్ బృందన్’
శుకుడు… రాజా! అలా వెళ్లి వెళ్లి అక్రూరుడు ఘన- గొప్పవైన చందనం, మల్లె, మొల్ల, తాల- తాడి, మద్ది, గోరంట, మర్రి, మామిడి మున్నగు తరు బృందంతో మనోజ్ఞంగా రాజిల్లుతున్న బృందావనాన్ని కన్నాడు. అది విప్పారిన ఎర్ర తామరల అందాలతో ఒప్పుతోంది. బలరామకృష్ణులను వలపులతో అలరించే ఆనందధామంగా విలసిల్లుతోంది. అక్రూరుడు పద్మ అంకుశాది రేఖలు గల, విచ్యుతి (నాశము) లేని అచ్యుతుని పాదముద్రలు తిలకించి పులకించి పోయాడు. అనంతరం బలరామకృష్ణులను గాంచి భక్తి పరవశుడైనాడు. ప్రేమావేశంలో ఒళ్లు గగుర్పాటు చెందగా, కళ్లలో ఆనంద బాష్పాలు సుళ్లు తిరిగాయి. తేరు నుంచి దూకి, ఇది నా రేని (స్వామి) పాదరజం (ధూళి) అంటూ వ్రజ గోరజంలో తీరుగా- విరజస్కుడై (రజోగుణ రహితుడై) పొర్లాడాడు. పాదాలకు ప్రణమిల్లాడు. డగ్గుత్తిక వలన తన గోత్ర ప్రవర చెప్పలేక పోయాడు. జీవుల దేహధారణకు ఇది కదా పరమ లాభం. భక్తవత్సలుడు అచ్యుతుడు మక్కువ మీర అక్రూరుని అక్కున చేర్చుకున్నాడు. తాను వచ్చిన కారణం వినిపించగా రామకృష్ణులు పక్కున నవ్వారు.
శుకుడు- రాజా! అక్రూరుడు రామకృష్ణులను మథురకు వెంటబెట్టుకు వెళతాడనే వార్త తెలియగానే నెలతలు- గోపికలు కలత చెందారు. తమలో తాము ఇలా తలపోశారు. మా ప్రాణేశ్వరుని- చక్రిని మా నుంచి వేరుచేసే ఈతడు నిజానికి క్రూరుడు. అక్రూరుడే అయితే వక్రత్వం- కుటులత్వం మాని, వారిజాక్షుని తమ వారికి విడిచి తన దారిని తాను వెళ్లాలని కుంద రదనలు అతనిని దూరారు- నిందించారు.
శా॥ ‘అక్రూరుండని పేరు పెట్టుకొని నేడస్మన్మనోవల్లభుం
జక్రిన్ మాకడ బాపికొంచు నరుగం జర్చించి యేతెంచినా
డక్రూరుండట క్రూరుడీతడు నిజం బక్రూరుడౌనేని, ని
ర్వక్రత్వంబున గృష్ణు బెట్టి తన త్రోవంబో విచారింపడే.’
నందగోకుల విహారి హరి మరునాటి సూర్యోదయ వేళ, తత్తరపడుతూ తన వెంట వస్తామని బిత్తర చూపులతో వస్తున్న లోకోత్తర ప్రేమ యోగినులు- గోప భామినులకు ‘మరల వస్తా’నని దూతికల ద్వారా చెప్పించి, మరులు గొల్పి- మాయచేసి వారిని మందకు తరలించాడు. నందాదులు వెంటరాగా అక్రూరుని స్యందనం అధిరోహించి గోవిందుడు సబలుడై మథురకు పయనమయ్యాడు. లేడి కన్నుల ముద్దుగుమ్మలు- అబలలు ఖిన్నలై తేరు కన్నంత మేర కదలక మెదలక బొమ్మల వలె సజల నేత్రాలతో చూస్తూ నిలబడ్డారు.
మార్గమధ్యంలో అక్రూరుడు రామకృష్ణుల అనుజ్ఞ తీసుకొని మనోజ్ఞమైన యమునా జలంలోని ‘బ్రహ్మహ్రదం’లో స్నానమాడుతూ, ఆ ఏటి నీటిలో సాటిలేని మేటి సోదరులను- రామకృష్ణులను దర్శించాడు. అబ్బురపడి వారు యథాప్రకారం రథంలో ఉండటమూ పరికించాడు. భ్రాంతి కాదు గదా! అని తిరిగి స్రవంతిలో మునిగాడు. ఈపరి- సారి మరింత ఆశ్చర్యం!
ఉ॥ ‘పోషిత బాంధవుండు యదు పుంగవుడా జలమందు గాంచె స
ద్భాషు సహస్ర మస్తక విభాసిత భూషు నహీశు భూమి భృ
ద్వేషు గృపాభిలాషు బ్రతివీరచమూ విజిగీషు నిత్యసం
తోషు నరోషు నిర్దళిత దోషు ననేక విశేషు శేషునిన్’
ఆత్మీయ బంధువులకు ఆపద్బాంధవుడు, యదు పుంగవుడు- శ్రేష్ఠుడూ అయిన గాందినీ సుతుడు అక్రూరుడు, ఆ నదీ జలాలలో అశేష విశేషాలు గల ఆశీవిష- నాగుల ఈశుని ఆదిశేషుని అవలోకించాడు. ఆ వ్యాల (సర్ప) రాజు సద్భాషు- వ్యాకరణ సమ్మతంగా- శాస్త్రీయంగా (పతంజలి రూపంలో) భాషించువాడు, సహస్ర మస్తక విభాసిత భూషు- వేయి తలలపై ప్రకాశించు పలు మణుల విభూషణాలు కలవాడు, అహీశు- ప్రచలాకాలకు (పన్నగాలకు) ప్రభువు, భూమి భృద్వేషు- అచలా (భూమి) భారం వహించు దివ్యవేషధారి, కృపాభిలాషు- కరుణ చూపుటయందు ఎక్కువ మక్కువ కలవాడు అనగా దయార్ద్ర హృదయుడు, ప్రతివీరచమూ విజిగీషు- శత్రుసైన్యాన్ని చిత్తుచేయ కోరువాడు, నిత్యసంతోషు, అరోషు- క్రోధ రహితుడు, నిర్దళిత దోషు- నిష్కలంకుడూ అయిన ఆ సర్పరాజును కనురెప్ప వాల్చక దర్శించాడు.
ఆ ఆదిశేషుని శయ్యపై పవళించి ఉన్న ఆ అయ్యని, అందాల గనిని, కౌస్తుభ మణిధరుని, వనమాలిని, హరిని, అనాది నిధనుడైన పురుషోత్తముని కని శఫల్కుని తనయుడు అక్రూరుడు భక్తి సంభ్రమాలతో అంజలించి, ‘నిన్ను పొగడటానికి నేను ఏపాటి వాణ్ని? నీ మాయచే ఆపద పాలైనవాణ్ని. అచ్యుతా! అనుగ్రహ బుద్ధితో నా ఆర్తి బాపి నన్ను ఆదరించు’ అంటూ సగుణ- నిర్గుణ- ఉభయ సామరస్య పూరితంగా అద్భుతమైన స్తవ- స్తోత్రగానం చేశాడు. భక్తకవి రాజు పోతన తపః పూత- పవిత్ర, కవితా చేతనా సరితలో వెల్లివిరిసిన ఫుల్ల అబ్జ (చక్కగా వికసించిన పద్మాలనే) స్తోత్ర తల్లజా- శ్రేష్ఠాలలో ఈ ‘అక్రూర స్తవం’ నిర్వక్రం! భావుక భక్తులకు నిత్యనూతనం! అక్రూరుడు ఆగకుండా నాగశయనుని ఇంకా ఇలా వినుతించాడు.
మ॥ ‘కలలం బోలెడి పుత్ర మిత్ర వనితాగారాది సంయోగముల్
జలవాంఛారతి నెండమావులకు నాసల్ సేయు చందంబునం
దలతున్ సత్యములంచు మూఢుడ వృథా తత్తజ్ఞుడన్ నాకు నీ
విలసత్పాదయుగంబు సూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతీ!’
‘రమానాథా! దాహం తీర్చుకోవడానికి, జలముల వలె భ్రమ కల్పించే ఎండమావులకు దండవేసి ఆశపడునట్లు, కలల వంటి పుత్రమిత్ర, కళత్రాలు, గృహ ఆరామ క్షేత్రాలు- ఇట్టి జంజాటం నిజమని నమ్మే వట్టి మూఢుణ్ని నేను. యథార్థం తెలియని వృథా- మిథ్యా తత్తజ్ఞుణ్ని- విపరీత జ్ఞాన ఘనుణ్ని. వందారు (నమస్కరించు భక్తులకు కల్పవృక్షమా)! ఓ నందపట్టీ! ఇలాంటి నాకు, ప్రకాశించే నీ పాద కెందామర (ఎర్ర కమలా)లను చూపించి ముదమొంద (ఆనందించునట్లు) కరుణతో కటాక్షించు’
శుకుడు- రాజా! ఇలా కమనీయ కాళిందీ జలాలలో అక్రూరునకు రమణీయమైన తన ముందటి- తొల్లింటి రూపం చూపి ఇందీవరశ్యాముడు వందితుడై అంతర్ధానం చెందాడు. అక్రూరుడు నీటి నుండి వెలువడి వెరగుపడుతూ వచ్చి అరదాన్ని అధిరోహించాడు. అప్పుడు అరవిందనేత్రుడు అతనితో ఇలా పలికాడు- అక్రూరా! జలములు ఎంతో దగ్గరలోనే ఉన్నాయే! తలపోయగా- చూడగా నీవు జలకా(స్నానా)నికి వెళ్లి చాలా సేపయింది. అవని మీదను, ఆకాశంలోనూ లేని వింతలేమైనా నీటియందు నీకు కనువిందు చేశాయా?
త్రివిక్రమ చక్రపాణితో అక్రూరుడు కడు వేడుకతో ఇలా నుడివాడు..
క॥ ‘నీలోన లేని చోద్యము
లే లోకములందు జెప్పరీశ్వర! నీటన్,
నేలన్ నింగిని నున్నవె?
నీలో జోద్యంబులెల్ల నెగడె మహాత్మా!’
‘భగవంతా! నీలో లేని వింతలు ఏ లోకాల దిగంతాలలో నైనా సుంతైనా ఉంటాయని ఏ గొప్పవారూ చెప్పలేదు. ఇక నీటిలోనూ, నేల మీదా, నింగి యందూ ఉంటాయా? సుచరిత్రా! భవలతా లవిత్రా! (సంసారమనే తీగను తెగనరికే కొడవలి వంటివాడా)! విచిత్రాలన్నీ నీలోనే ఉన్నాయి.’ ఇలా అని అక్రూరుడు సాయంకాలానికి మథురాపురి చేరే విధంగా రథం నడిపాడు. కృష్ణుడు తేరు దిగి అక్రూరునితో ‘నీవు రథం తోలుకొని నేరుగా గృహానికి వెళ్లు. మేము వేరుగా, తీరికగా తరువాత వస్తాం’ అని పలుకగా శ్వఫల్క పుత్రుడు..
క॥ ‘నా యింటికి విచ్చేయుము
నీ యంఘ్రి సరోజరేణు నికరము సోకన్
నా యిల్లు పవిత్రంబగు
శ్రీయుత! నీ భటుని బెద్దసేయం దగదే!’
‘ఇందిరా రమణా! ఈ తీరుగ పలుక నీకు తగునా? నీవు నా మందిరానికి విచ్చేయవలె. యాదవ శిరోరత్నమా! నీ పాదారవిందాల ధూళి నికరం- సమూహం సోకి నా నికేతనం పావనమవుతుంది. సాదరంగా నిమంత్రిస్తున్న నీ బంటుని- ఈ చంటివానిని, ఇంటికి వచ్చి ఆ మాత్రం ఆదరింపరాదా?’ అంటూ మరీమరీ వేడుకుంటున్న అక్రూరునితో వెన్నుడు- శ్రీహరి ఇలా విన్నవించాడు… ‘అనఘా! అక్రూరా! యదువులకు ఎదపై బల్లెమై మదంతో సంచరిస్తున్న కంసుని కదనరంగంలో మర్దించి ముదమార నీ సదనాన్ని సందర్శిస్తా. ప్రస్తుతానికి తేరు తీసుకుని నీవు మథురాపురికి చేరుకో.’ శుకుడు- రాజా! శ్రీకృష్ణుడు ఇట్లు నచ్చచెప్పగా విని అక్రూరుడు నగరానికి చని, రామకృష్ణులు వచ్చిరని కంసునికి తెలిపి తన గృహానికి వెళ్లాడు. కన్నయ్య అపరాహ్ణంలో అన్న బలరామునితో, గోపన్నలతో కూడి మథురలో ప్రవేశించాడు.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006