విరిగిన మనసులకు ఓ కారుణ్య గాథ
ఆకాశం నిండా కమ్ముకున్న కటిక చీకటి మేఘాలు.. ఆ సాయంత్రం అహ్మద్ మనసులోని స్థితికి అద్దం పడుతున్నాయి. ఇంటి అరుగు మీద ఒంటరిగా కూర్చున్న అతని కళ్లలో శూన్యం. వ్యాపారంలో నష్టాలు, వెన్నాడుతున్న అనారోగ్యం, తీరని అప్పులు.. వీటన్నిటికంటే మిన్నగా, గతంలో తాను చేసిన పొరపాట్లు అతణ్ని లోలోపల ఒక నిశ్శబ్ద యుద్ధంలోకి నెట్టేస్తున్నాయి.
- ఇస్లాం బోధ
ఆకాశం నిండా కమ్ముకున్న కటిక చీకటి మేఘాలు.. ఆ సాయంత్రం అహ్మద్ మనసులోని స్థితికి అద్దం పడుతున్నాయి. ఇంటి అరుగు మీద ఒంటరిగా కూర్చున్న అతని కళ్లలో శూన్యం. వ్యాపారంలో నష్టాలు, వెన్నాడుతున్న అనారోగ్యం, తీరని అప్పులు.. వీటన్నిటికంటే మిన్నగా, గతంలో తాను చేసిన పొరపాట్లు అతణ్ని లోలోపల ఒక నిశ్శబ్ద యుద్ధంలోకి నెట్టేస్తున్నాయి. ‘నాలాంటి పాపిని ఆ దేవుడు క్షమిస్తాడా? నా మీద దయ చూపుతాడా?’ ఈ ప్రశ్న అతణ్ని ఒక నీడలా వెంటాడసాగింది.
మౌనంలో వికసించిన సంభాషణ
అప్పుడే అహ్మద్ తాతయ్య అక్కడికి వచ్చారు. అహ్మద్ భుజంపై ఆప్యాయంగా చేయి వేశారు. మనవడి కళ్లలోని తడిని చూసి ఆయన పెదవులపై ఒక చిన్నపాటి ఓదార్పు నవ్వు చిందింది. ‘అహ్మద్.. ఎందుకు అంత దిగులు? ఆ అల్లాహ్ కారుణ్యం గురించి నీకు ఇంకా తెలియదా?’ అన్నారాయన మెల్లగా. అహ్మద్ తల దించుకుని, ‘తాతగారూ! నేను ఎన్నో తప్పులు చేశాను. నా ప్రార్థనలు ఆ దేవుడి దరికి చేరుతాయని నేననుకోవడం లేదు’ అని తన నిస్సహాయతను వెళ్లగక్కాడు.
సృష్టిలోని ప్రేమ.. సృష్టికర్త కారుణ్యం
దూరంగా పడుకున్న ఆవును, దాని చుట్టూ గెంతుతున్న దూడను చూపించారు తాతయ్య. ‘చూడు అహ్మద్, ఆ మూగజీవి తన బిడ్డపై కాలు పడకుండా ఎంత జాగ్రత్తగా ఉందో చూశావా? ఆ తల్లి మనసులో ఆ దయను నింపింది ఎవరు? సాక్షాత్తు ఆ అల్లాహ్. ఈ భూమి మీద ఉన్న తల్లులందరి ప్రేమను కలిపినా, అది దేవుని కారుణ్యంలో ఒక చిన్న అణువంత మాత్రమే. మరి నీ తల్లి కంటే మిన్నగా నిన్ను ప్రేమించే ఆ సృష్టికర్త నిన్ను వదిలేస్తాడా?’ అన్నారు. ఈ మాటలు వింటుంటే అహ్మద్ కళ్లలో ఒక చిన్న మెరుపు. తాతయ్య కొనసాగించారు: ‘ఖురాన్లో అల్లాహ్ ఇలా అంటున్నాడు- మీ ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ అన్ని పాపాలనూ క్షమిస్తాడు. ఆయన క్షమించేవాడు, కరుణించే వాడూను’
దారి ఎక్కడ ఉంది?
‘కానీ తాతగారూ, నాకు దారి ఎలా దొరుకుతుంది?’ అని అడిగిన అహ్మద్కు తాతయ్య ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్పారు. ‘దారి మన కళ్ల ముందే ఉంది నాయనా. మన ఊపిరి, చూపు, ఈ ప్రకృతి.. ఇవన్నీ ఆయన కారుణ్యానికి నిదర్శనాలు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) చెప్పినట్లు, ‘భూమిపై ఉన్న వారిపై మీరు దయ చూపండి, ఆకాశంలో ఉన్నవాడు మీపై దయ చూపుతాడు’ ఎవరికైనా సహాయం చెయ్, ఆకలి తీర్చు, నీ మాటతో ఎవరినీ నొప్పించకు.. అప్పుడే అల్లాహ్ కారుణ్యం నీపై జల్లులా కురుస్తుంది’ అని వివరించారు. మర్నాడు సూర్యోదయం అహ్మద్ జీవితంలో ఒక కొత్త వెలుగును తెచ్చింది. భయం స్థానంలో భరోసా చేరింది. తను తింటున్న ఆహారంలో కొంత భాగాన్ని పొరుగున ఉన్న పేదవాడికి పంచుతూ, ఆకాశం వైపు కృతజ్ఞతగా చూశాడు. అతనికి ఇప్పుడు అర్థమైంది.. అల్లాహ్ కారుణ్యం అనేది సరిహద్దులు లేని మహాసాగరం. అందులో మునకలేయడానికి కావలసింది పాపభీతి కాదు, పశ్చాత్తాపంతో కూడిన ఒక స్వచ్ఛమైన మనసు మాత్రమే అని.
…? ముహమ్మద్ ముజాహిద్
96406 22076
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

