ఓ రైతు తన కూతురికి ఘనంగా పెండ్లి చేశాడు. ఆమె అత్తారింటికి వెళ్లే రోజు దగ్గరపడింది. ఆ ఊర్లోనే పుట్టి, అక్కడే పెరిగి, ఆ ఊరి బడిలోనే చదివి ఇప్పుడు కొత్తగా వేరే ఊరికి వెళ్లాల్సి రావడం వల్ల ఆమెలో ఆందోళన మొదలైంది. ఒక రోజు రైతు వరి నారు కోసం విత్తనాల వడ్లను సమకూర్చుకుంటున్నాడు. అప్పుడే కూతురు తండ్రి దగ్గరికి వచ్చి ఏడుపు మొహం పెట్టి నిలబడింది. కారణమేమిటని అడిగాడు తండ్రి. కొత్త ఊరు, కొత్త మనుషులు, కొత్త మనస్తత్వాలు, కొత్త వాతావరణం ఎలా ఉంటుందోనని భయంగా ఉందని చెప్పింది. రైతు నవ్వుతూ ‘అక్కడి వాళ్లూ మనుషులే తల్లీ. ధైర్యంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది’ అని ధైర్యం చెప్పాడు. అయినా కూతురి ముఖంలో భయం తగ్గలేదు. ఇలా కాదనుకుని కూతురు చూస్తుండగానే విత్తనాల వడ్లను కొన్నిటిని నీళ్ల తొట్టెలో పోశాడు. కొద్దిసేపటికి వాటిలోని వడ్లు కొన్ని పైకి తేలాయి. మిగిలినవి నీళ్ల అడుగునే ఉండిపోయాయి.
రైతు వాటిని కూతురికి చూపిస్తూ ఇలా చెప్పాడు ‘తేలిన వడ్లు సచ్చువి. నారు పోయడానికి పనికి రావు. నీళ్ల అడుగున నానుతున్న వడ్లు గట్టివి. మనకి ఉపయోగపడతాయి. వాటిని నారుగా పోస్తే చక్కటి వరి మొక్కలవుతాయి. మన కడుపు నింపే బియ్యపు గింజలవుతాయి. అలాగే నువ్వు మొదట అందరితో మంచిగా ఉండు. ఎందుకంటే ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో మనకి ముందే తెలియదు. నీళ్లలో వేసే వరకు మనకి ఏ వడ్లు మంచివో ఏ వడ్లు ఉపయోగపడనివో తెలియలేదు కదా. మనుషులతో సంబంధాలు కూడా అంతే. కొన్నాళ్లు వారితో కలిసి ఉంటే రోజులు గడిచే కొద్దీ వారి గురించి తెలుస్తుంది. అప్పుడు ఎవరిని దగ్గరికి తీయాలో, ఎవరిని దూరంగా పెట్టాలో నీకు తెలిసిపోతుంది’ అని వివరించాడు. నాన్న మాటల్లోని లోతును అర్థం చేసుకున్న కూతురు నవ్వు ముఖంతో ఇంట్లోకి వెళ్లింది.