ఒక నదీ తీరాన ఓ భక్తుడు అమ్మవారి ఆలయం నిర్మించాడు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ఉత్సవాల సమయాల్లో ఏనుగు అవసరమని భావించాడు. అది తెలుసుకున్న ఇద్దరు సంపన్నులు తమ దగ్గర ఉన్న ఏనుగులను ఆలయానికి బహూకరించాలని భావించారు. రెండు ఏనుగులను భరించడం చాలా ఖర్చు, శ్రమతో కూడుకున్న వ్యవహారమని చెప్పారు మావటీలు. అయితే అవి ఉన్న ప్రదేశాలకు వెళ్లి రెండిటిలో ఒకదాన్ని ఎంపిక చేయమని కోరాడు ఆలయ స్థాపకుడు.
ఒక మంచి రోజు చూసుకుని మొదటి ఏనుగు దాత దగ్గరకు వెళ్లారు మావటీలు. వారికి ఏనుగును చూపాడు దాత. ఆ ఏనుగు అలంకరణలతో ఉంది. ఎంపిక చేసే పనిలో పడ్డారు మావటీలు. ఇక దాన్ని ఎంపిక చేయడం ఖాయమని భావించాడు దాత. చిన్నగా ఏనుగు నుదిటిపై బంగారు రంగులో ఉండే నెట్టిపట్టం, మెడకు, కాళ్లకు ఉండాల్సిన గంటలు, వీపు మీద అలంకరించే పట్టు వస్ర్తాలు, ఏనుగుపైన కూర్చునే వారు పట్టుకునే గొడుగులు అన్నీ తీసుకుని ఉత్త ఏనుగును ఇవ్వబోయాడు. దాత సంకుచిత మనస్తత్వం నచ్చని మావటీలు పది రోజుల తర్వాత వచ్చి కలుస్తామని చెప్పి అక్కడినుంచి వచ్చేశారు.
మరో దాత ఉన్న గ్రామానికి వెళ్లారు. ఆ ఏనుగు కూడా అలంకరణలతో ఉంది. ఏనుగుకు ఉన్న ఆభరణాలు, అలంకరణలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచి తీసుకెళ్లమని కోరాడు దాత. వారు సంతోషంగా దాన్ని స్వీకరించారు. వస్తూవస్తూ నదిలో దానికి శుభ్రంగా స్నానం చేయించి ఆలయం దగ్గరికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న ఆలయ స్థాపకుడు మొదటి ఏనుగును కాదనడానికి కారణమేమిటని మావటీలను అడిగాడు. అలంకరణలు తీసి ఏనుగును ఇవ్వదలిచిన దాత దానిని మనస్పూర్తిగా ఇవ్వలేదు. ఎందుకంటే ఏనుగు తనది కాదనుకున్నాక కూడా దానిపై ఉండే వస్తువుల మీద అతనికి వ్యామోహం తగ్గలేదు. అలాంటి వ్యక్తి దగ్గర ఏనుగును దానంగా తీసుకోవడం మాకు నచ్చలేదు. అతను దానాన్ని నలుగురి మెప్పుకోసం చేస్తున్నట్లుగా తోచిందని వివరించారు. మావటీల వివరణకు ఆలయ స్థాపకుడు ఆనందించాడు. ఆ సంవత్సరం జరిగిన ఉత్సవంలో ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.