గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతీ
పురాం భేత్తుశ్చిత్త ప్రశమరస విద్రావణఫలే
ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంస కలికే
తవాకర్ణాకృష్ట స్మరశర విలాసం కలయతః॥
(సౌందర్య లహరి – 52)
జగద్గురువు ఆదిశంకరులు అమ్మవారి నేత్రాలను అద్భుతంగా వర్ణించారు. ఆయన ధ్యానంలో తాను దర్శించిన అమ్మవారి నేత్రాల సౌందర్యాన్ని, కడకంటి చూపుల విలాసాన్ని మనకు ఇలా దర్శింపజేశారు. ‘అమ్మ ‘గోత్రాధరపతి కులోత్తంస కలిక’- పర్వతరాజు హిమవంతుడి కుమార్తెగా, ఆయన వంశానికి సిగపువ్వుగా, కలికితురాయిగా ప్రకాశించే తల్లి. అమ్మ విశాలాక్షి. అమ్మ కనులు ఆకర్ణాయత లోచనాలు. కుడి కన్ను కుడి చెవి వరకు, ఎడమ కన్ను ఎడమ చెవి వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ చెవులలో భక్త కవులు పులకరించి ఆనంద తన్మయత్వంతో నిన్ను వర్ణించి చెప్పిన కవిత్వాన్ని ఆలకించి రెండు కనులూ ఆనందిస్తున్నాయి. ఆ అదృష్టం లేని మూడోనేత్రం మాత్రం కొద్దిగా అసూయతో కూడిన బాధ వల్ల అరుణవర్ణం దాల్చింద’ని శంకరులు చమత్కరించారు.
ఒకప్పుడు దేవతలకు ఒక ఆపద వచ్చింది. తారకాసురుడు తపస్సుచేసి బ్రహ్మ ను మెప్పించి పార్వతీశంకరుల కుమారుడి చేతిలో మాత్రమే మరణించే విధంగా వరాన్ని పొందాడు. ఇప్పుడు తారకాసుర సంహారం కావాలి అంటే పార్వతి, పరమేశ్వరుల వివాహం కావాలి. శంకరుడేమో ‘పురాంభేత్తుః’ అంటే త్రిపురా లను సంహరించి యోగసాధనలో నిశ్చల తత్త్వం కలిగి, ఆనంద విభూతిలో రమిస్తున్న వాడు. అతను మోహ పరవశుడై పార్వతిని వివాహమాడితేనే వారికి సంతానం కలుగుతుంది. ఆ సంతానం చేతిలోనే తారకుని సంహారం అవుతుం ది. అప్పుడే లోకకల్యాణం జరుగుతుంది. దాక్షాయణీదేవి మేనక హిమవంతుల కూతురిగా పార్వతి పేరుతో అవతరించింది. కాని శంకరుడిని మోహింపజేయ డం ఎలా? ఇంద్రుడు ఆ బాధ్యతను మన్మథుడికి అప్పగించాడు. మన్మథుడు తన దగ్గరున్న అరవిందం, అశోకం, మామిడి, నవమల్లిక, నల్లకలువ అనే అయిదు బాణాలతో ఎవరినైనా వశం చేసుకోగలననే నమ్మకంతో ప్రయత్నించా డు. మన్మథుని బాణాలు ఎవరిలోనైనా తాపాన్ని కలిగించగలిగేవే! కానీ, శంకరుడి విషయంలో మాత్రం పనిచేయలేదు. ఫలితంగా శివుడి కంటిమంటలో మన్మథుడు భస్మమయ్యాడు. ఆయన భార్య రతీదేవి ప్రార్థనమేరకు పునర్జీవితు డయ్యాడు. ‘ఇప్పుడు పార్వతిపై శంకరుడికి అనురాగం కలిగేందుకు ఏంచేయాలి?’ అనుకున్నాడు మన్మథుడు.
మన్మథుడు అమ్మవారి భక్తుడు. ఆ తల్లి సాయాన్ని తీసుకున్నాడు. ‘వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి కో హి విజ్ఞాతు మర్హతి’ అన్నారు. అమ్మవారి మనసు అధర్మంపై వజ్రంవలె కఠోరంగానూ, తన భక్తుల విషయంలో పుష్పాలకన్నా సుకుమారంగానూ ఉంటుందట. అందుకే మన్మథుడిని అనుగ్రహించింది. ఎలాగూ తన బాణాలు వ్యర్థమయ్యాయి కాబట్టి, మన్మథుడు అమ్మవారి కనుచూపులనే బాణాలుగా, కనురెప్పలనే బాణానికి చివరగా ఉండే పక్షాలుగా (ఈకలుగా) చేసుకొని పరమేశ్వరునిపై విజయం సాధించాడట. దానితో పరమశివుడి మనసులో ఉన్న నిస్పృహ పోయి శృంగార రసం ఆవిష్కృతమైంది. ఆ కనులు ఎలా ఉన్నాయంటే ఆకర్ణాంతం లాగిన మన్మథుని బాణాల్లా ఉన్నాయంటారు ఆది శంకరులు. ఈశ్వరుడు ఆ కడకంటి చూపుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు.
ఆదిశక్తి సృష్టిచేయాలనే సంకల్పంతో తనను తాను రెండుగా విభజించుకున్నది. ఒకటి ప్రకాశాంశ, రెండోది విమర్శాంశ అంటారు. ఒకటి పురుషుడు, రెండోది స్త్రీ లేదా ప్రకృతి. పురుషుడి స్పందన లేనిదే సృజన జరగదు. కాబట్టి, మన్మథుడు అమ్మవారి కనుచూపుల సాయంతో పరమశివుడిలో స్పందన కలిగించాడు. దానితో శివపార్వతుల వివాహం జరిగింది. వారికి కలిగిన కుమారుడు కుమారస్వామి వల్ల తారకాసుర సంహారంతో లోకకల్యాణం జరిగింది.
-పాలకుర్తి రామమూర్తి