డెహ్రాడూన్: భర్త మరణంతో భారంగా అనిపించిన ఇద్దరు కుమార్తెలను ఒక తల్లి అమ్మేసింది. అయితే అనూహ్యంగా నాలుగేళ్ల తర్వాత వెట్టి చాకిరి నుంచి వారికి విముక్తి లభించింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఈ సంఘటన జరిగింది. భర్త చనిపోవడంతో మైనర్ కుమార్తెలను తల్లి పోషించలేకపోయింది. దీంతో 12, 10 ఏళ్ల బాలికలను ఇద్దరు వ్యక్తులకు అమ్మేసింది. బాలికలను కొన్న వ్యక్తులు వారితో ఇంటి పనులు, పశువుల పనులు చేయించుకుంటున్నారు. అంతేగాక వారిని హింసించసాగారు.
ఈ నేపథ్యంలో ఒక బాలిక అనుభవిస్తున్న మూగ వేదన గురించి ఒక ఎన్జీవో సంస్థకు గురువారం తెలిసింది. దీంతో వారు పిల్లల సంరక్షణ సంస్థకు సమాచారం ఇచ్చారు. డెహ్రాడూన్లోని క్లెమెంట్ టౌన్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నాలుగేళ్ల కిందట ఒక బాలికను కొనుగోలు చేశాడని, ఆమెతో ఇంటి పనులు చేయించుకోవడంతోపాటు కొట్టి హింసిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆ బాలికను రక్షించారు.
మరోవైపు టర్నర్ రోడ్లో నివాసం ఉండే ఒక వ్యక్తికి తన చెల్లిని కూడా తల్లి అమ్మేసిందని ఆ బాలిక అధికారులకు చెప్పింది. దీంతో వారు ఆ ప్రాంతానికి వెళ్లారు. అయితే ఆ వ్యక్తి తన ఇంటి తలుపు తెరిచేందుకు నిరాకరించాడు. దీంతో పోలీసులు ఆ ఇంటి మిద్దె మీదకు వెళ్లి బలవంతంగా తలుపు తెరిపించారు. కాగా, ఆ బాలికను తెలిసిన వ్యక్తి ఇంటికి పంపినట్లు అతడు చెప్పాడు. దీంతో ఆ బాలికను కూడా పోలీసులు అనంతరం రక్షించారు.