ముంబై: పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్న మహిళను ఒక వ్యక్తి కత్తితో పలుమార్లు పొడిచాడు. అయితే స్థానికులు భయంతో అతడ్ని అడ్డుకోలేకపోయారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ దారుణం జరిగింది. గురువారం మధ్యాహ్నం స్థానిక జాదవ్ పెట్రోల్ బంక్ వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. అక్కడ పని చేస్తున్న జుబేదా షేక్ అనే మహిళపై అతడు కత్తితో దాడి చేశాడు. దీంతో భయంతో ఆమె ఆ పెట్రోల్ బంక్ చుట్టూ పరుగెత్తింది. ఆ వ్యక్తి కూడా ఆమెను వెంబడించాడు. కింద పడిన ఆమెపై పలుమార్లు కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, మిట్ట మధ్యాహ్నం అంతా చూస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో పెట్రోల్ బంక్ వద్ద ఉన్న వారు ఆ వ్యక్తిని అడ్డుకునేందుకు కొంత ప్రయత్నించారు. అయితే అతడి చేతిలో కత్తి ఉండటంతో ఎవరూ పెద్దగా సాహసం చేయలేకపోయారు. మహిళపై కత్తితో దాడి తర్వాత పారిపోతున్న అతడ్ని పట్టుకునేందుకు ఇద్దరు ప్రయత్నించి విఫలమయ్యారు.
మరోవైపు విషయం తెలిసిన పోలీసులు ఆ పెట్రోల్ బంక్ వద్దకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన జుబేదాను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఆ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.