పట్నా : బిహార్లోని భాగల్పూర్ ప్రాంతం కబీర్పూర్లో దారుణం వెలుగుచూసింది. మహిళకు తుపాకీ గురిపెట్టి లైంగిక దాడికి పాల్పడి నేరాన్ని వీడియో తీసి ఆపై బ్లాక్మెయిల్ చేస్తూ నెలల తరబడి లైంగిక దాడికి తెగబడిన నిందితుడి ఉదంతం కలకలం రేపింది. బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొద్ది నెలల కిందట మహిళ కొవిడ్-19 లాక్డౌన్ సమయంలో నీళ్లు పట్టుకునేందుకు బయటకు వెళ్లడంతో నిందితుడు ఇర్ఫాన్ ఆమెకు తుపాకి గురిపెట్టి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక దాడి దృశ్యాలను ఫోన్లో రికార్డు చేశాడు. ఆపై వీడియోను వైరల్ చేస్తానని బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి తెగబడ్డాడు. దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక చోటికి పిలిపించి లైంగిక దాడికి పాల్పడేవాడు.
శనివారం కూడా బాధితురాలిని బెదిరించిన నిందితుడు తన కోరిక తీర్చకుంటే వీడియోను వైరల్ చేయడంతో పాటు ఆమె కుటుంబ సభ్యులను చంపుతానని హెచ్చరించాడు. ధైర్యం కూడదీసుకున్న మహిళ సోమవారం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఇర్ఫాన్పై ఫిర్యాదు చేసింది. ఇర్ఫాన్ అదే ప్రాంతంలోని ఇతర మహిళలనూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, భయంతో వారు ఫిర్యాదు చేయడం లేదని బాధితురాలు ఎస్పీకి వివరించింది. తనకు న్యాయం జరగనిపక్షంలో తనకు ఆత్మహత్య మినహా మరో మార్గం లేదని ఆమె తెలిపింది. దర్యాప్తు అనంతరం నిందితుడిపై కఠిన చర్యలు చేపడతామని పోలీసులు బాధితురాలికి హామీ ఇచ్చారు.