ముంబై: సూట్‌కేస్‌లో బాలిక మృతదేహం లభించింది. ఈ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత గుజరాత్లో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరి ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఆగస్ట్ 25న స్కూల్ వదిలిన తర్వాత అదృశ్యమైంది. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అయితే మరునాడు పాల్గఢ్ జిల్లా నయిగావ్ సమీపంలోని వాలివ్ ప్రాంతంలో రోడ్డు పక్కన పొదల్లో పడేసిన సూట్‌కేసులో బాలిక మృతదేహం లభించింది. ఆమె మృతదేహాన్ని దుపట్లో చుట్టి సూట్‌కేసులో కుక్కారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
మరోవైపు ఆ బాలిక కిడ్నాప్, హత్య వెనుక ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ముంబై పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ నేపథ్యంలో 21 ఏళ్ల వయసున్న ఇద్దరు నిందితులను గుజరాత్‌లోని పాలన్‌పూర్‌లో శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. వారిద్దరిని ముంబైకు తరలించి ప్రశ్నిస్తున్నారు. బాలికను ఎందుకు కిడ్నాప్ చేసి హత్య చేశారో అన్నది దర్యాప్తులో తెలుస్తుందని పోలీస్ అధికారి వెల్లడించారు.