అహ్మదాబాద్ : గుజరాత్లోని హర్జి ప్రాంతంలో ప్రియుడితో పారిపోయిందనే ఆగ్రహంతో మహిళ జట్టుకత్తిరించి ముఖానికి నల్లరంగు పూసిన ఉదంతం వెలుగుచూసింది. ఈ దారుణ ఘటనను కొందరు వీడియోలో రికార్డు చేయగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో తెగ వైరలవుతోంది. వది తెగకు చెందిన గిరిజనులు తమ కట్టుబాట్లను మహిళ ఉల్లంఘించిందనే ఆగ్రహంతో ఈ దాడికి తెగబడ్డారు. తనను విడిచిపెట్టాలని మహిళ గ్రామస్తులను వేడుకున్నా వారు కనికరించని దృశ్యాలు వీడియోలో కనిపించాయి.
ఆమె ఏడుస్తున్నా పట్టించుకోకుండా పురుషులు ఆమె ముఖంపై నల్ల ఇంకు చల్లారు. మహిళ చేసిన పనితో తమ తెగకు చెడ్డపేరు వచ్చిందనే కోపంతో ఆమెను శిక్షించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే సీనియర్ అధికారులు రంగంలోకి దిగారు. పటాన్ ఎస్పీ సుప్రీత్ సింగ్ గులాటీ ఘటనా స్ధలానికి చేరుకుని 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీడియోలో కనిపించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారని ఎస్పీ గులాటీ తెలిపారు.