బొల్లారం : ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తూ వాటిని స్క్రాప్ రూపంలో విక్రయిస్తున్న నిందితుడిని బుధవారం తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా న్యాయస్థానం అతడికి జైలు శిక్ష విధించింది. అతడికి సహకరించిన ముగ్గురు మైనర్లను కోర్టులో ప్రవేశపెట్టి పెరెంటల్ బాండ్ పై విడుదల చేశారు.
సి.ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన కథనం ప్రకారం..వెస్ట్ వెంకటాపురం కు చెందిన గాజుల సంతోష్ కుమార్ (31)మెకానిక్, స్థానికంగా మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు.ఇతను జల్సాలకు అలవాటుపడి మెకానిక్ వృత్తి ద్వారా వచ్చే ఆదాయం సరిపడక ద్విచక్ర వాహనాల దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో తిరుమలగిరి, బోయిన్పల్లి, తుకారంగేట్, అల్వాల్, పేట్‌బషీరాబాద్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మైనర్ల సహకారంతో 11 ద్విచక్ర వాహనాలను దొంగలించాడు.ఇలా దొంగలించిన వాహనాలను కట్టర్ ద్వారా విడివిడి భాగాలుగా చేసి విక్రయించాడు.
ఈ క్రమంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు సంబంధించిన సీసీ పుటేజీలను పరిశీలించిన పోలీసులు సంతోష్ కుమార్ తో పాటు అతడికి సహకరించిన ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.సంతోష్ కుమార్ ను 22వ ఏసీ ఎమ్ ఎమ్ కోర్టు సికింద్రాబాద్ లో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 15 రోజులు జైలు శిక్ష విధించడం జరిగిందని సీఐ తెలిపారు. ముగ్గురు మైనర్లను ఏసీఎమ్ఎమ్ జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టారు.
ముగ్గురు మైనర్లను పెరెంటల్ బాండ్‌పై విడుదల చేశారు. సంతోష్ కుమార్ నుంచి 4ద్విచక్ర వాహనాలను 7విడిభాగాలు గా చేసిన ద్విచక్ర వాహనాలతో పాటు రూ.1లక్ష 900ల నగదు, కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు చేధనలో చాకచక్యంగా వ్యవహారించిన ఎస్సైలు శివ శంకర్,సూర్యలతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లను సీఐ అభినందించారు.