Sputnik-V Scientist Murder | కరోనా మహమ్మారిని నిరోధించేందుకు స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ రూపొందించిన శాస్త్రవేత్తల్లో ఒకరు ఆండ్రీ బొటికోవ్ (47) దారుణ హత్యకు గురయ్యాడు. మాస్కోలోని ఆయన అపార్ట్మెంట్లోనే బెల్ట్‌తో ఆండ్రీ బొటికోవ్ హత్య చేయబడ్డాడు. ఈ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గామాలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మ్యాథమెటిక్స్‌లో సీనియర్ రీసెర్చర్‌గా బొటికోవ్ పని చేశాడు. గురువారం ఆయన అపార్ట్మెంట్లో మరణించి ఉన్నాడని రష్యన్ ఫెడరేషన్ దర్యాప్తు కమిటీని ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థ టాస్ పేర్కొంది.
బొటికోవ్ హత్య కేసును దర్యాప్తు కమిటీ దర్యాప్తు చేస్తున్నది. ఒక అంశంపై వివాదం నెలకొనడంతో బొటికోవ్తో 29 ఏండ్ల కుర్రాడు వాగ్వాదానికి దిగాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ వివాదంలో కోపోద్రిక్తుడైన ఆగంతకుడు బెల్ట్‌తో బొటికోవ్ గొంతు కోసి హత్య చేసి పారిపోయాడని చెప్పారు. హత్య జరిగిన కొద్ది సేపటికే ఆగంతకుడిని అరెస్ట్ చేశామని ఫెడరల్ దర్యాప్తు సంస్థ తెలిపింది. తమ దర్యాప్తులో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని పేర్కొంది. ఇంతకుముందు కూడా ఒక తీవ్రమైన నేరం చేసిన కేసులో ట్రయల్ ఖైదీగా ఉన్నాడని తెలిపింది.
కొవిడ్-19 వ్యాక్సిన్ నివారణకు కృషి చేసినందుకు బొటికోవ్ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2021లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ది ఫాదర్లాండ్ అవార్డుతో గౌరవించారు. 2020లో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో కీలకంగా వ్యవహరించిన 18 మంది శాస్త్రవేత్తల్లో బొటికోవ్ ఒకరు.