నల్లగొండ : పొలాల వద్ద, కాలువ కట్టల మీద ఉంచిన ట్రాక్టర్ ట్రాలీలను దొంగతనం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి నుంచి అయిదు ట్రాలీలు రికవరీ చేయడంతో పాటు ఒక ఇంజిన్ కలిగిన ట్రాక్టర్, బైక్ సీజ్ చేసినట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం నల్లగొండ డీఎస్పీ కార్యాలయంలో శాలిగౌరారం సిఐ రాఘవరావు, సీసీఎస్ సీఐ దుబ్బ అనిల్, తిప్పర్తి ఎస్.ఐ. సత్యనారాయణలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలను వెల్లడించారు.
గురువారం తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనిశెట్టి, దుప్పలపల్లి వద్ద తిప్పర్తి ఎస్.ఐ. సత్యనారాయణ సిబ్బందితో కలిసి దుప్పలపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వై జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇద్దురు వ్యక్తులు బైక్ పై నల్లగొండ నుంచి తిప్పర్తి వైపుకు వస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు.
విచారణలో భాగంగా నల్లగొండ పట్టణం ఏ.ఆర్.నగర్ కు చెందిన దుంప సంపత్, కట్టంగూరు మండలం పిట్టంపెళ్లికి చెందిన సురిగి మధు, నల్లగొండ పానగల్ కు చెందిన అలకుంట్ల వెంకన్న, ఖమ్మంకు చెందిన ఓర్సు రామకృష్ణ, ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన దుబ్బల రఘు, నల్లగొండ ఏ.ఆర్.నగర్ కు చెందిన దుంప అయిలయ్య, దుంప శివ, దుంప రాజు అందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి.. కాలువ కట్టల మీద, వ్యవసాయ పొలాల వద్ద, పశువుల కొట్టాల వద్ద నిలిపి ఉంచుతున్న ట్రాక్టర్ ట్రాలీలను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
కాగా, పరారీలో మరో ముగ్గురు నిందితులు ఉన్నారని వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. ఈ ముఠాపై కట్టంగూరు, తిప్పర్తి, నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు అయినట్లు ఆయన చెప్పారు. కేసులో సమర్ధవంతంగా పనిచేసిన శాలిగౌరారం సీఐ రాఘవరావు, తిప్పర్తి ఎస్.ఐ. సత్యనారాయణ, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.