లక్నో: నిర్లక్ష్యంగా కారు నడిపిన బాలుడు ఒక సైక్లిస్ట్‌ను ఢీకొట్టాడు. అలాగే ఆపబోయిన ట్రాఫిక్ పోలీస్‌ను కారు బానెట్‌పై సుమారు రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 12న 17 ఏళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్నాడు. కారు డ్రైవ్ చేస్తున్న అతడు సిహాని గేట్ ప్రాంతంలో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. ఇది చూసి కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కూడా కారుతో ఢీకొట్టాడు. దీంతో ఆయన కారు బానెట్‌పై పడి ప్రమాదకరంగా వేలాడసాగాడు. అయినప్పటికీ ఆ బాలుడు కారును ఆపకుండా రెండు కిలోమీటర్ల దూరం వరకు అలాగే డ్రైవ్ చేశాడు. ఇది చూసిన స్థానికులు ఆ కారును వెంబడించి అడ్డుకుని నిలువరించారు. ఆ యువకుడ్ని కారు నుంచి బయటకు లాగి పోలీసులకు అప్పగించడంతో అతడ్ని అరెస్ట్ చేశారు.
మరోవైపు ఇద్దరు స్నేహితులు కారుతో సహా అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే పోలీసులు అనంతరం ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. కారును నిర్లక్ష్యంగా నడిపి అరెస్టైన 17 ఏళ్ల బాలుడు ఒక ప్రైవేట్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్నాడని పోలీసులు తెలిపారు. అతడితోపాటు మరో ఇద్దరు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పరారైన మరో ఇద్దరిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.