పాఠశాలలో పరీక్షల దృష్ట్యా స్పెషల్ క్లాసుల కోసం అమ్మాయిలను ఓ ఉపాధ్యాయుడు రాత్రివేళ రమ్మన్నాడు. అలా వెళ్లిన అమ్మాయిలను భోజనంలో మత్తు మందు కలిపి పెట్టి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులకు అమ్మాయిల తల్లిదండ్రులు ఈ విషయం చెప్పినా.. వారు ఫిర్యాదు నమోదు చేయలేదు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాలలోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్ జిల్లాలో ఓ ప్రైవేటు స్కూల్ నడుపుతున్న ఉపాధ్యాయుడు నవంబర్ 17న అదే పాఠశాలలో 10వ తరగతి చదివే 17 మంది విద్యార్థినులను ప్రాక్టికల్ ఎగ్జామ్(పరీక్ష) దృష్ట్యా ప్రత్యేక తరగతుల కోసం రాత్రివేళ రమ్మన్నాడు. అలా ప్రత్యేక తరగతుల కోసం వెళ్లిన 17 మంది అమ్మాయిలకు అతడు భోజనంలో మత్తు మందు కలిపి పెట్టాడు.
స్పృహలోలేని సమయంలో వారిపై అత్యాచారం చేశాడు. ఆ ఉపాధ్యాయుడితోపాటు అతని స్నేహితుడు కూడా అత్యాచారం చేశాడు. ఆ విద్యార్థినులంతా పేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో.. ఆ ఉపాధ్యాయుడు వారిని ఈ విషయం బయట ఎవరికైనా చెబితే వారితోపాటు వారి తల్లిదండ్రులను కూడా చంపేస్తానని బెదిరించాడు. కానీ ఇద్దరు అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో.. వారు పోలీసుల వద్దకు వెళ్లారు. కానీ పోలీసులు ఆ ఉపాధ్యాయుడు ఊరిలో పెద్దమనిషి కావడంతో ఫిర్యాదు నమోదు చేయలేదు. దీంతో బాధితులు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు.
ఎమ్మెల్యే ఒత్తిడి చేయడంతో పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి ఆ కీచక ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. కానీ అతని స్నేహితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. స్థానిక పోలీసులు ముందుగా ఫిర్యాదు చేయనందుకు వారిపై కూడా విచారణ జరుగుతోంది.