పాట్నా: బంగారు ఆభరణాలు విక్రయించే షాపులో పని చేసే సేల్స్ గర్ల్‌పై బైక్‌పై వచ్చిన కొందరు తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశారు. అయితే మృతురాలి కుటుంబం ఆమె భర్తపై అనుమానం వ్యక్తం చేసింది. బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. లోహియానగర్ ప్రాంతంలోని ఆనంద్‌పూర్ గ్రామానికి చెందిన 27 ఏళ్ల నేహాకు 2011లో లఖిసరాయ్‌లోని రాంపూర్ గ్రామానికి చెందిన ఇషాంక్ భరద్వాజ్‌తో వివాహమైంది. అయితే ఈ పెళ్లిపై ఇషాంక్ కుటుంబ సభ్యులు అసంతృప్తితో ఉన్నారు. దీంతో అతడు భార్యతో కలిసి అత్తమామల ఇంట్లో ఐదేళ్ల పాటు ఉన్నాడు. వారికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే 2016లో భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఇషాంక్ అత్తమామల ఇంటిని విడిచి వెళ్లిపోయాడు.
కాగా, బెగుసరాయ్‌లోని తనిష్క్ షో రూమ్‌లో సేల్స్ గర్ల్‌గా పని చేస్తున్న నేహా, ఆదివారం పని తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నది. అయితే బైక్‌పై వచ్చిన కొందరు ఆమెపై తుపాకులతో కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు తన కుమార్తెను చంపుతానని ఆమె భర్త కొన్ని రోజులుగా ఫోన్లో బెదిరిస్తున్నాడని నేహా తల్లి ఆరోపించింది. తనతో కొంత సమయం గడపాలంటూ భార్యకు ఫోన్ చేసేవాడని, దీనికి ఆమె తిరస్కరించినట్లు తెలిపింది. ఇటీవల కొందరు తనను వెంబడిస్తున్నారని, భయంగా ఉందంటూ కుమార్తె తనకు చెప్పినట్లు పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది.