గువహటి : ముగ్గురు మైనర్ బాలికలపై లైంగిక దాడి కేసులో అనుమానితుడు (50) కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న ఘటన అసోంలోని మారిగావ్ జిల్లాలో వెలుగుచూసింది.
బాలికల కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా రెండు రోజుల కిందట నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా నిందితుడు పదేండ్ల లోపు వయసున్న ముగ్గురు మైనర్ బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతుండగా ఆదివారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో మరో బాలికపై కూడా లైంగిక దాడికి పాల్పడ్డానని నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
బాధితురాలి దుస్తులు కూడా తన ఇంట్లో ఉన్నాయని చెప్పడంతో ఆధారాలు సేకరించేందుకు నిందితుడిని గురువారం అతడి ఇంటి వద్దకు తీసుకువెళ్లగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి కాళ్లపై కాల్పులు జరిపామని, ప్రస్తుతం నిందితుడు గువహటి మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు.