Injection Suffari Case | ఖమ్మం జిల్లా ముదిగొండ సూది సుఫారీ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఒక మహిళతో వివాహేతర సంబంధమే ఈ సూది సుఫారీకి కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నారని సమాచారం. వారిలో ఒకరు ఆటో డ్రైవర్, మరొకరు ట్రాక్టర్ డ్రైవర్, ఇంకొకరు ఆర్ఎంపీ డాక్టర్ అనుమానితులుగా ఉన్నారు. నిందితులు పథకం ప్రకారమే జమాల్‌కు ఇంజక్షన్ ఇచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్, సీసీటీవీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు.
చింతకాని మండలం బొప్పారం గ్రామ వాసి షేక్ జమాల్.. వల్లభి గ్రామ సమీపాన హత్యకు గురి కావడం ఈ ప్రాంతంలో కలకలం రేగింది. నిందితులు పక్కాగా రెక్కీ నిర్వహించిన తర్వాతే ఈ దారుణానికి దిగి ఉంటారని భావిస్తున్నారు. మోటార్‌బైక్‌పై వెళుతున్న జమాల్‌ను లిఫ్ట్ అడిగిన వ్యక్తి తన ముఖానికి పూర్తిగా మాస్క్ ధరించాడు. దీన్ని బట్టి జమాల్ బయలుదేరినప్పటి నుంచి నిందితులు ఆయన్ను వెంటాడి ఉంటారని అనుమానిస్తున్నారు.
షేక్ జమాల్‌కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు అమీదా బేగంను జగ్గయ్యపేట మండలం గండ్రాయిలోని లాల్ సాహెబ్‌కు, చిన్న కూతురు షాజహాన్ బేగమ్‌ను ఖమ్మం పట్టణ వాసికి ఇచ్చి పెండ్లి చేశాడు. నాలుగు రోజుల క్రితం జమాల్ దంపతులు గండ్రాయిలోని పెద్ద కూతురు ఇంటికెళ్లారు. అదే రోజు జమాల్ తిరిగి వచ్చాడు. తన భార్యను తీసుకొచ్చేందుకు సోమవారం బైక్‌పై బయలుదేరిన జమాల్.. అనూహ్యంగా హత్యకు గురయ్యాడు.