మీరట్ : యూపీలో మహిళలు, యువతులు, చిన్నారులపై ఆగడాలు కొనసాగుతున్నాయి. ప్రేమ ప్రతిపాదనను నిరాకరించడంతో పాటు చెంపదెబ్బ కొట్టిందనే కోపంతో పదో తరగతి విద్యార్ధినిని (16) పట్టపగలే హత్య చేసిన వ్యక్తి ఘటన బులంద్‌షహర్‌లో కలకలం రేపింది. బులంద్‌షహర్‌లోని బిజీ హైవే సమీపంలో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్కూలుకు వెళుతున్న బాలికను ఆమె పొరుగింటి వ్యక్తి ప్రేమ పేరుతో వెంబడిస్తూ వేధింపులకు గురిచేసేవాడు.
ఈ క్రమంలో బాలిక ఫోన్ నెంబర్ అడగడంతో ఆమె అతడిని చెంప చెళ్లుమనిపించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు బాలికను నెట్టడంతో రాయిపై పడిన బాలిక ఘటనాస్ధలంలోనే మరణించింది. బాలిక మరణించిందని తెలుసుకున్న నిందితుడు ఘటనా స్ధలం నుంచి పారిపోయాడు. బాలిక మృతికి నిరసనగా గ్రామంలో చేపట్టిన నిరసనల్లోనూ నిందితుడు పాల్గొన్నాడు. కాగా గ్రామస్తుల సమాచారంతో పాటు పోలీసుల దర్యాప్తులో నిందితుడి వ్యవహారం వెలుగుచూసింది. ఇద్దరు మిత్రుల సహకారంతో తానే ఈ ఘోరానికి పాల్పడ్డానని నిందితుడు (15) నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.