Teenagers drowned | స్నానం చేసేందుకు సరస్సులోకి వెళ్లి ఏడుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో చోటుచేసుకున్నది. గోవింద్ సాగర్‌లో మునిగి మృతి చెందిన వారిని పంజాబ్‌కు చెందిన వారిగా గుర్తించారు. బంగానా పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. కోల్కా బాబా గరీబ్ దాస్ మందిర్ సమీపంలోని గోవింద్ సాగర్ సరస్సులో సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్ బనూర్ జిల్లా మహోలి గ్రామానికి చెందిన 11 మంది బాబా బాలక్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకునేందుకు బయలుదేరి వెళ్లారు. ఆలయానికి సమీపంలోని గోవింద్‌సాగర్ సరస్సులో స్నానం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే సరస్సులోకి దిగగా.. లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయారు. నలుగురు యువకులు ప్రాణాలతో బయపడి.. మిగతా వారిని కాపాడాలని, కేకలు వేశారు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని కాపాడేందుకు ప్రయత్నించగా.. అప్పటికే వారంతా నీటిలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో యువకుల కోసం గాలించి, చివరకు మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాదంలో ఏడుగురు యువకులు మృతి చెందారని బంగానా ఎస్డీఎం యోగరాజ్ ధీమాన్ పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.