న్యూఢిల్లీ: హాస్టల్లోని యువతుల పట్ల సెక్యూరిటీ గార్డు అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. కరోల్ బాగ్ ప్రాంతంలో గోల్డ్ విల్లా ప్రైవేట్ లేడీస్ హాస్టల్ ఉంది. అందులో ఉంటున్న కొంత మంది యువతులు ఈ నెల 13న కారిడార్‌లో నడుస్తుండగా అక్కడి సెక్యూరిటీ గార్డు వారిని అడ్డుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ఒక యువతిని పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. మిగతా యువతులు భయంతో తలోవైపు పరుగులు తీశారు. ఆ బాధితురాలు మరునాడు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోయింది.
కాగా, ఆ హాస్టల్లోని సీసీటీవీలో రికార్డైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. అయితే ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ముందుకు రాలేదు. దీంతో న్యాయ నిఫుణులను సంప్రదించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేశారు.
మరోవైపు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) కూడా ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించింది. కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అలాగే తీసుకున్న చర్యలపై ఈ నెల 18 సాయంత్రంలోగా నివేదిక సమర్పించాలని పేర్కొంది. డీసీడబ్ల్యూ చైర్పర్సన్ స్వాతి మలివాల్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. దారుణమైన సంఘటనగా ఆమె పేర్కొన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.
करोल बाग में चल रहे एक PG hostel में सिक्योरिटी गार्ड ने नशे की हालत में लड़कियों के साथ छेड़खानी और मारपीट की. हमें ट्विटर के जरिए शिकायत मिली, मामले की गंभीरता को देखते हुए पुलिस को नोटिस जारी किया है. मामले में कड़ी कार्यवाही सुनिश्चित करेंगे। pic.twitter.com/6smwjfqEJB
— Swati Maliwal (@SwatiJaiHind) August 16, 2022