Bihar | పాట్నా : బీహార్ రాజధాని పాట్నాలో ఓ సర్పంచ్ భర్త తుపాకీతో హల్ చల్ చేశాడు. పెళ్లి వేదికపై అటు ఇటు తిరుగుతూ గాల్లోకి కాల్పులు జరిపి అందర్నీ భయభ్రాంతులకు గురి చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
పాట్నా దిఘా పోలీసు స్టేషన్ పరిధిలోని నక్తా దియారా సర్పంచ్ భర్త విమల్ రాయ్.. ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇక ఆ వేదికపై కొంత మంది మహిళలు డ్యాన్సులు చేస్తుండగా, విమల్ రాయ్ తన చేత్తో తుపాకీ పట్టుకుని హల్చల్ చేశాడు. గాల్లోకి మూడు, నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. అయితే అక్కడున్న వారంతా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి తన మొబైల్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశాడు. గతంలోనూ విమల్ రాయ్ ఇలాంటి ఘటనలకు పాల్పడి జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.