హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని జుబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 కేబుల్ బ్రిడ్జి- ఐకియా సమీపాన కోహినూర్ హోటల్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగా హీరో సాయిధరమ్ తేజకు తీవ్ర గాయాలయ్యాయి. తొలుత మెడికవర్ దవాఖానలో చికిత్స పొందిన సాయిధరమ్ తేజను మెరుగైన చికిత్స కోసం జుబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానకు తరలించారు.
సాయి ధరమ్ తేజ స్పోర్ట్స్ బైక్‌పై గచ్చిబౌలి వైపు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. అతివేగంగా బైక్ నడుపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. ప్రమాద సమయంలో 120 కి.మీ. వేగంతో వెళుతున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తీరును సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లతో అధికారులు తెలుసుకుంటున్నారు. రోడ్డుపై ఇసుక చేరడంతో బ్రేక్ వేసినా ఆగలేదని చెబుతున్నారు.
వెంటనే చికిత్స కోసం ఆయనను సమీప ప్రైవేట్ దవాఖానా మెడికవర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయనకు వైద్యులు అన్ని వైద్య పరీక్షలు చేశారు. అంతర్గతంగా ఏమైనా గాయాలయ్యాయా? అన్న విషయాన్ని వైద్యులు పరీక్షిస్తున్నారు. ఆయనకు స్కానింగ్ చేసిన తర్వాత ప్రమాదం లేదని నిర్ధారించినట్లు తెలుస్తున్నది.
ప్రమాదం జరిగిన సంగతి తెలుసుకున్న మాదాపూర్ పోలీసులు అక్కడికి చేరుకుని బైక్ సీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఇతర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఇంకా మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్, సినీ నటులు సందీప్‌కిషన్, ఉత్తేజ్ తదితరులు దవాఖానకు చేరుకుని వైద్యులు సాయిధరమ్ తేజ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.