అహ్మదాబాద్ : మంచూరియా ఆర్డర్‌ను తీసుకోలేదనే కోపంతో ఓ వ్యక్తి ఫుడ్ జాయింట్ యజమానితో పాటు ముగ్గురు వ్యక్తులను దుర్భాషలాడి వారిపై దాడికి తెగబడిన ఘటన అహ్మదాబాద్‌లోని ఎక్స్‌ప్రెస్ హైవేపై చోటుచేసుకుంది. దాడి అనంతరం నిందితుడు రోహిత్ రాణా (28)పై బాధితుడు మోహన్ భర్వాద్ (49) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తాము షాపు మూసివేసే సమయంలో రాణా మంచూరియన్ డిష్‌ను ఆర్డర్ చేశాడని షాపు మూసివేస్తున్నామని చెప్పడంతో ఆగ్రహానికి లోనై తమపై దాడికి పాల్పడ్డాడని భర్వాద్ తెలిపారు. తనతో పాటు షాపులో పనిచేసే ముగ్గురు ఉద్యోగులను దుర్భాషలాడుతూ దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మరోవైపు ఫుడ్ జాయింట్ ఓనర్ భర్వాద్, ముగ్గురు ఉద్యోగులపై రాణా ఫిర్యాదు చేశాడు. తన పార్సిల్‌ను ప్యాక్ చేసి ఇవ్వాలని వారిని పలుమార్లు కోరగా వారు తనపై దాడి చేశారని ఆరోపించాడు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.