చండీగఢ్: బీజేపీ పాలిత హర్యానాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక స్పాలో బాలికను బెదిరించి ప్రతిరోజూ సుమారు 10 నుంచి 15 మంది వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు రెండోసారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్పందించారు. ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో ఈ సంఘటన జరిగింది. సెక్టార్ 49 ప్రాంతంలో 14 ఏళ్ల బాలిక నివసిస్తున్నది. ఉద్యోగం కోసం అన్వేషించిన ఆమె గత నెలలో పూజా అనే మహిళను కలిసింది. ఒక క్లినిక్‌లో ఆమె ఉద్యోగం చూపించగా రెండు రోజుల్లోనే పని నుంచి తీసేశారు. 15 రోజుల తర్వాత ఆ బాలికను పూజా మళ్లీ కలిసింది. ఒమాక్స్ గురుగ్రామ్ మాల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కింగ్ స్పాలో పనికి కుదిర్చింది. పూజా బంధువైన జుమా అనే మహిళ ఆ స్పాను నిర్వహిస్తున్నది.
కాగా, ఆ స్పాలో చేరిన తొలి రోజు నుంచే తనపై లైంగిక వేధింపులు మొదలయ్యాయని ఆ బాలిక పోలీసులకు తెలిపింది. స్పాలోని ఒక గదిలోకి తనను బలవంతంగా పంపగా ఒక వ్యక్తి అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. దీంతో పని మానేస్తానని చెప్పగా రికార్డు చేసిన వీడియో చూపించి బెదిరించి బలవంతంగా పనిలో కొనసాగించారని ఫిర్యాదులో పేర్కొంది. ఐదు రోజుల పాటు బలవంతంగా ఆ స్పాలో పని చేశానని, ప్రతి రోజూ 10-15 మంది వ్యక్తులు తనపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపించింది.
చివరకు తన తల్లి మద్దతుతో ఆ స్పాలో పని మానేసినట్లు ఆ బాలిక పోలీసులకు చెప్పింది. అయితే నిర్వాహకురాలు జుమా, పూజతోపాటు రూబెల్, సద్దాం కలిసి తనను వేధిస్తున్నారని, వారి వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నలుగురు కలిసి స్థానిక బాలికలను లొంగదీసుకుని వ్యభిచార రొంపిలోకి దించుతున్నారని ఆరోపించింది.
మరోవైపు గత వారం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆ బాలిక చెప్పింది. అయితే ఒక నిందితుడ్ని ప్రేమించినట్లు తనతో బలవంతంగా అబద్ధం చెప్పించారని ఆమె తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని రూబెల్ ఒట్టు కూడా వేశాడని, అనంతరం ఆ విషయం పట్టించుకోలేదని ఆరోపించింది.
మైనర్ బాలిక ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. నిందితులైన స్పా నిర్వాహకురాలు జుమా, పూజ, రూబెల్, సద్దాంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు.