జైపూర్ : ఎన్నెన్నో ఊహాలతో, ఆశలతో పెళ్లి చేసుకుంది. తనకు కాబోయే భర్తతో సరదాగా గడపాలనుకుంది. తొలిరాత్రి సమయం రానే వచ్చింది. పడకగదిలోకి వెళ్లిన ఆ నవ వధువుకు నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఆమెకు నిర్వహించిన కన్యత్వ పరీక్షలో ఫెయిలైంది. తన సంసార జీవితం తొలిరాత్రితోనే ఆగిపోయింది. ఇక అత్తమామలు, భర్తల ఆగడాలు మితిమీరిపోయాయి. కన్యత్వ పరీక్షలో ఫెయిలైనందుకు ఆ వధువుకు రూ. 10 లక్షలు జరిమానా విధించారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ బాగోర్లో 24 ఏండ్ల యువతికి ఈ ఏడాది మే 11న వివాహమైంది. పెళ్లైన తర్వాత తొలిరాత్రి రోజే ఆమెకు కన్యత్వ పరీక్ష నిర్వహించగా, ఆమె ఫెయిలైంది. ఈ విషయాన్ని వరుడు తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో అత్తమామలు, భర్త ఆమెను వేధింపులకు గురి చేశారు. సాన్సీ తెగకు చెందిన ఈ కుటుంబాల్లో కుకడీ అనే ఆచారం కింద పెళ్లైన నవ వధువుకు కన్యత్వ పరీక్ష నిర్వహిస్తారు.
అత్తమామలు, భర్త వేధింపులు భరించలేని బాధితురాలు నిజం చెప్పేసింది. పెళ్లి కొద్ది నెలల ముందు పొరుగింటి యువకుడు తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. ఈ ఘటనపై సుభాష్ నగర్ పోలీసు స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. అవేమీ అత్తమామలు పట్టించుకోలేదు. ఆమెను మానసికంగా వేధిస్తూనే ఉన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మే 18వ తేదీన స్థానికంగా ఉన్న ఓ దేవాలయం వద్ద వరుడి కుటుంబ సభ్యులు పంచాయతీ నిర్వహించారు. వధువు కన్యత్వ పరీక్షలో ఫెయిలైందని పంచాయతీ పెద్దలకు చెప్పారు. ఆమె పెళ్లికి ముందే అత్యాచారానికి గురైందని తెలిపారు. ఆ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మళ్లీ మే 31న పంచాయతీ నిర్వహించి, బాధితురాలికి రూ. 10 లక్షలు జరిమానా విధించారు. అంత డబ్బు తాను చెల్లించలేనని వధువు చెప్పింది. ఈ నేపథ్యంలో గత ఐదు నెలల నుంచి అత్తమామల వేధింపులు తాళలేక బాధితురాలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్తతో పాటు అత్తమామలను పోలీసులు అరెస్టు చేశారు.