జగద్గిరిగుట్ట : నగరంలోని కూకట్పల్లి ఎల్లమ్మబండలో రౌడీషీటర్ హత్య కేసును ( Murder case ) పోలీసులు 24 గంటల్లో చేధించారు. కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు ( Arrest ) చేశారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వివరాలను వెల్లడించారు. కర్ణాటకనుంచి వచ్చి ముషీరాబాద్‌లో నివాసముంటున్న మహబూబ్ (40) స్క్రాప్ దుకాణం నిర్వహిస్తూ దొంగతనం, హత్య సహా 13 కేసుల్లో నిందితుడని తెలిపారు. అతడిపై రౌడీషీట్ కూడా కొనసాగుతోందని వివరించారు.
ఐదేండ్ల క్రితం ఎల్లమ్మబండకు చెందిన స్క్రాప్ వ్యాపారి సయ్యద్ ఫాజిల్ (48) వద్ద రూ.11 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుసార్లు అడగ్గా చంపుతానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో అప్పు ఇచ్చిన ఫాజిల్, అతని మేనల్లుడు సయ్యద్ జహంగీర్(23) మహబూబ్‌ను చంపేందుకు పథకం వేశారు. ఎల్లమ్మబండకు చెందిన ఆటోడ్రైవర్లు షేక్ కరీం (23), షేక్‌అమీర్(23) సహకారం తీసుకుని ప్రణాళిక ప్రకారం మాట్లాడుకుందామని మహబూబ్‌ను మంగళవారం సాయంత్రం ఎల్లమ్మబండలోని గుడ్వీల్ హోటల్‌కు పిలిచారు.
అందరూ కలిసి టీ తాగుతుండగానే ఒక్కసారి కత్తులతో దాడి చేసి హత్య చేసి పారిపోయారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపామని, హత్యకు ఉపయోగించిన కత్తులు, ఆటో స్వాధీనం చేసుకున్నామని వివరించారు.