న్యూఢిల్లీ: అతను ఒక ఉన్నత విద్యావంతుడు. ఎంబీఏ చదివాడు. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో హెచ్ఆర్ ఫ్రొఫెషనల్‌గా ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి సొంతంగా ఓ రెస్టారెంట్ పెట్టాడు. కానీ వ్యాపారం సరిగా నడవకపోవడంతో లక్షల్లో నష్టపోయాడు. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒక ధనవంతుడైన బ్యాచిలర్లా నటిస్తూ పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేశాడు. వారి నెత్తిన లక్షల్లో టోపీ పెట్టాడు. చివరి ఒక యువతి ఫిర్యాదుతో నిందితుడు కటకటాలపాలయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్ జిల్లాకు చెందిన ఓ 26 ఏళ్ల వ్యక్తి విశాల్ ఉన్నత విద్యను అభ్యసించాడు. బీసీఏ, ఎంబీఏ పూర్తిచేసి గుర్గావ్లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్ ప్రొఫెషనల్‌గా ఉద్యోగంలో చేరాడు. లక్షల్లో డబ్బు సంపాదించాలన్న ఆశతో మూడేండ్లకే ఉద్యోగం మానేసి సొంతం ఓ రెస్టారెంట్ పెట్టుకున్నాడు. అయితే రెస్టారెంట్ వ్యాపారం అతనికి కలిసిరాలేదు. లక్షల్లో అప్పులయ్యాయి.
దాంతో వ్యాపారం చేసి భారీగా డబ్బు సంపాదించాలన్న అతని ఆలోచనలు ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలనే స్థాయికి దిగజారాయి. అందుకోసం ఒక మోసపూరిత మర్గాన్ని ఎంచుకున్నాడు. మ్యాట్రిమోనీల్లో రిచ్ బ్యాచిలర్లా ప్రోఫైల్ పెట్టాడు. ఆ ప్రోఫైల్ చూసి కాంటాక్ట్ అయిన యువతులకు.. అద్దెకు తెచ్చుకున్న లగ్జరీ కార్లు, బంగ్లాలు చూపిస్తూ ధనవంతుడిలా బిల్డప్ ఇచ్చేవాడు. ఆపై మాయమాటలు చెప్పి వాళ్ల నుంచి లక్షల్లో డబ్బు గుంజేవాడు. అనంతరం వాళ్ల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసి దూరంపెట్టేవాడు.
అందిరిలాగే గుర్గావ్కు చెందిన ఓ యువతి, ఆమె కుటుంబం కూడా విశాల్ బుట్టలో పడింది. మ్యాట్రిమోనీలో ప్రోఫైల్ చూసి విశాల్‌ను కాంటాక్ట్ అయ్యింది. ధనవంతుడిలా అతను చూపించిన డాబు, దర్పానికి వారు పడిపోయారు. తనకు పలు విల్లాలు ఉన్నాయని, హోటల్ వ్యాపారాలు ఉన్నాయని యువతితో నమ్మబలికాడు. ఆపై విదేశాల నుంచి ఖరీదైన ఫోన్లు, తదితర వస్తువులు తక్కువ ధరకే తెప్పిస్తానని చెప్పి ఆమె నుంచి డబ్బులు గుంజాడు. ఆమె స్నేహితురాళ్లు, బంధువుల నుంచి ఆర్డర్లు తీసుకున్నాడు.
ఇలా మొత్తం రూ.3.05 లక్షలను బాధితురాలి నుంచి రాబట్టాడు. ఆ తర్వాత బాధితురాలు వస్తువుల గురించి అడగడంతో మాటదాటేశాడు. కొన్నాళ్లకు ఆమె ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి ముఖం చాటేశాడు. దాంతో మోసపోయినట్లు గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఓ మహిళా కానిస్టేబుల్‌తో డెకాయ్ ఆపరేషన్ చేయించి నిందితుడు విశాల్‌ను బుట్టలో వేశారు. ఆమె ద్వారా ఓ ఏరియాకు రప్పించి అక్కడ అతడిని అదుపులోకి తీసుకున్నారు.