తను మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉండటాన్ని తల్లిదండ్రులు తప్పుపట్టడంతో ఆ కుర్రాడు తట్టుకోలేకపోయాడు. అమ్మానాన్న బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లో కూర్చొని విషం తాగేశాడు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్‌లో వెలుగు చూసింది. వెల్లోట్టాంపరప్పు ప్రాంతంలో నివశించే సదరు కుర్రాడి వయసు 18 సంవత్సరాలు. ఇటీవలే 12వ తరగతి పరీక్షలు రాశాడు. ఇంట్లో ఉన్నంతసేపూ ఆ కుర్రాడు తన మొబైల్లో గేమ్స్ ఆడుతూనే ఉంటున్నాడు.
అది చూసిన తల్లిదండ్రులు చీవాట్లు పెట్టారు. వాళ్ల కోపం తట్టుకోలేపోయిన కుర్రాడు.. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి విషం తాగేశాడు. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత తమ బిడ్డ చలనం లేకుండా పడిపోయి ఉండటం చూసిన ఆ తల్లిదండ్రులు భయంతో వణికిపోయారు. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తీసకెళ్లారు. కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. దాంతో ఆ కుటుంబం ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయింది.