ముంబై : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ క్షణాల్లోనే ఖాతాల నుంచి డబ్బులను గుంజేస్తున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆన్లైన్లో వైన్‌కు ఆర్డర్ చేసిన ఓ ఎన్ఆర్ఐని సైబర్ క్రిమినల్ రూ 1.54 లక్షలకు టోకరా వేశాడు. అమెరికాలోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న ఎన్ఆర్ఐ (27) హాలిడే గడిపేందుకు ముంబై వచ్చాడు.
ఆన్లైన్లో వైన్ కొనుగోలు చేసే ప్రక్రియలో తాను భారీ మొత్తాన్ని పోగొట్టుకున్నానని బాధితుడు వాపోయాడు. వైన్‌షాపు ఉద్యోగిగా పరిచయం చేసుకున్న నిందితుడు బాధితుడి ఇంటర్నేషనల్ కార్డు వివరాలు పంచుకోవాలని కోరాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గంటలోపే కార్డును బ్లాక్ చేశారు.
తన స్నేహితుడు పంపిన వైన్ షాపు ఫోన్ నెంబర్‌కు బాధితుడు ఫోన్ చేయగా లిఫ్ట్ చేసిన నిందితుడు వైన్ పంపాలంటే రూ 5,550 పంపాలని కోరాడు. ఆపై నిందితుడి ఉద్దేశం తెలియని బాధితుడు మరోసారి వైన్ ఆర్డర్ కోసం ఫోన్ చేయగా నిందితుడు కార్డు వివరాలను కోరి రూ 1.54 లక్షలు కాజేశాడు. కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.