ముంబై: రచయిత్రిపై వ్యాపారవేత్త స్టార్ హోటల్లో లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పవద్దంటూ ‘డీ-గ్యాంగ్’ పేరుతో ఆమెను బెదిరించాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. జూహు ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్లో 75 ఏళ్ల బిజినెస్ మ్యాన్, 35 ఏళ్ల రచయిత్రిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ (డీ-గ్యాంగ్) పేరు చెప్పి ఆమెను బెదిరించాడు. పోలీసులకు చెబితే చంపుతామని ఆమెను హెచ్చరించాడు.
కాగా, బాధిత మహిళ ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేసింది. దావూద్ ఇబ్రహీంకు చెందిన గ్యాంగ్ (డీ-గ్యాంగ్) నుంచి తనకు బెదిరింపులు వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక దాడికి పాల్పడిన వ్యాపారవేత్త తన నుంచి రూ.2 కోట్ల డబ్బులు అప్పుగా తీసుకున్నట్లు ఆరోపించింది. తనపై జరిగిన దారుణాలపై నిలదీయడంతో ఆ వ్యాపారవేత్త, ఆయనకు సంబంధం ఉన్న డీ-గ్యాంగ్ మనుషులు తనను నేరుగా బెదిరించినట్లు ఫిర్యాదు చేసింది.
మరోవైపు, కేసు నమోదు చేసిన అంబోలీ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ కేసును ఎంఐడీసీ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. దీంతో ఆ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది ఆ మహిళ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నారు.