పశ్చిమ గోదావరి : జిల్లాలోని కామవరపుకోట మండలం ఈస్ట్ యడవల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏరువ సుబ్బలక్ష్మి అనే మహిళ స్థానికంగా ఓ పాన్ షాపు నిర్వహిస్తోంది. మంగళవారం సాయంత్రం పాన్ షాపులో ఆమె కూతురు కూర్చొని ఉంది. సుబ్బలక్ష్మి షాపు బయట వేరే పనిలో నిమగ్నమైంది.
అయితే ఫ్రిజ్ వైర్లు షార్ట్ సర్క్యూట్‌కు గురి కావడంతో మంటలు చెలరేగాయి. షాపులో ఉన్న పెట్రోల్ బాటిల్స్‌కు మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన తల్లి సుబ్బలక్ష్మి కూతురిని కాపాడుకునేందుకు షాపులోకి వెళ్లి ఆమెను బయటకు లాగేసింది. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ సుబ్బలక్ష్మి సజీవ దహనమైంది. కూతురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఏలూరు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.