ఫరీదాబాద్ : బాయ్‌ఫ్రెండ్‌తో సంబంధాన్ని నిరాకరించిందనే కోపంతో ప్రియుడి సూచనలతో కన్నతల్లినే దారుణంగా కడతేర్చిన బాలిక ఉదంతం హర్యానాలోని ఫరీదాబాద్‌లో వెలుగుచూసింది. హత్య కేసులో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాయ్‌ఫ్రెండ్‌తో సంబంధాన్ని తల్లి వ్యతిరేకించిందనే కోపంతో బాలిక ఆమెపై ప్రతీకారంతో రగిలిపోయింది. జులై 10 అర్ధరాత్రి దాటిన తర్వాత బాయ్‌ఫ్రెండ్ వీడియో కాల్లో సూచనలు ఇస్తుండగా తల్లిని హత్య చేసింది.
అంతకుముందు బాయ్‌ఫ్రెండ్ బాలిక ఇంటికి వచ్చి ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చి వెళ్లాడు. మాత్రలు కలిపిన నిమ్మరసాన్ని తల్లితో తాగించిన బాలిక ఆపై ఆమె మత్తులోకి జారుకోగానే కడతేర్చింది. నిందితులిద్దరినీ పోలీసులు కోర్టులో హాజరుపరచగా 18 ఏండ్ల యువకుడిని ఫరీదాబాద్ జైలుకు తరలించగా బాలిక(16)ను జువెనల్ హోంకు పంపామని పోలీసులు వెల్లడించారు.