భోపాల్: పనికి వెళ్లాలంటూ భార్య పదే పదే పోరుపెట్టింది. దీంతో విసిగిపోయిన భర్త కత్తెరతో ఆమెను పొడిచి హత్య చేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈ సంఘటన జరిగింది. విభోర్ సాహు అనే వ్యక్తి డ్రైవర్గా పని చేస్తున్నాడు. అయితే 15 రోజులుగా అతడు పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో ఇల్లు గడవడం లేదని, పనికి వెళ్లాలంటూ భార్య పదే పదే చెప్పింది.
కాగా, శుక్రవారం విభోర్ సాహూ తల్లి, సోదరుడు ఒక మతపరమైన వేడుక నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఉన్న భర్త విభోర్ సాహూను పనికి వెళ్లాలంటూ భార్య రీతు (23) మరోసారి పోరుపెట్టింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఆగ్రహం చెందిన విభోర్ సాహూ ఆవేశంతో కత్తెరతో భార్యను పొడిచాడు. ఆమె కింద పడి రక్తం మడుగుల్లో మరణించింది. అనంతరం సాహూ ఆత్మహత్య చేసుకున్నాడు.
మరోవైపు ఇంటికి తిరిగి వచ్చిన తల్లి, సోదరుడు… సాహూ, అతడి భార్య చనిపోవడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాంఝీ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సహదేవ్రామ్ సాహు తెలిపారు.