ముంబై : పెండ్లి పేరుతో మహిళను లోబరుచుకుని ఆపై ముఖం చాటేసిన యువకుడు ఆపై మాజీ గర్ల్‌ఫ్రెండ్ అభ్యంతరకర వీడియోలను ఆమె కాబోయే భర్తకు పంపిన ఘటన ముంబైలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు(24) తనతో పాటు పనిచేసే మహిళ(22)కు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆపై పెండ్లి చేసుకుంటానని ముంబైలోని ఓ హోటల్లో పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఆపై ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాల్లో చేరడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. మరోవైపు తనను పెండ్లి చేసుకోవాలని ఆమె కోరినా నిందితుడు నిరాకరించాడు.
ఈ ఏడాది ఆరంభంలో యువతికి ఆమె తల్లితండ్రులు యూపీకి చెందిన యువకుడితో నిశ్చితార్ధం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు తన మాజీ గర్ల్ ఫ్రెండ్ తనతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఆ యువకుడి ఫోన్‌కు పంపాడు. నిందితుడు తన బ్యాంక్ ఖాతా నుంచి రూ 80,000 తీసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. నిందితుడి తీరుతో యూపీ యువకుడితో మహిళ వివాహం రద్దైంది. నిందితుడి ఆగడాలతో విసిగిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడితో పాటు అతడికి సహకరించిన స్నేహితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.