జైపూర్ : పొరుగింటి బాలికను బలవంతంగా లోబరుచుకుని ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం రాజస్ధాన్‌లోని కోటలో వెలుగుచూసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాలిక (16) తల్లి క్యాన్సర్ చికిత్స కోసం జైపూర్ వెళ్లినప్పటి నుంచి ఆమెను నిందితుడు లైంగికంగా వేధిస్తున్నాడు. బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండటంతో సోమవారం పరీక్షలు జరపగా ఈ ఘోరం బయటపడింది.
ఖటోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడి ఇంటి పక్కన ఉండే బాలిక తల్లి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఏప్రిల్ 12న క్యాన్సర్ చికిత్స కోసం కుమార్తెను ఇంటి వద్ద ఉంచి కొడుకును వెంటపెట్టుకుని ఆమె జైపూర్‌కు వెళ్లింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న బాలికను బెదిరిస్తూ ఆరు నెలలుగా నిందితుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.