చెన్నై : కోరిక తీర్చేందుకు నిరాకరించిందనే కోపంతో ప్రియురాలిని హత్య చేసిన నిందితుడు రక్తపు మరకలున్న షర్ట్‌తో బస్టాండ్‌లో పట్టుబడిన ఘటన తమిళనాడులో కలకలం రేపింది. చెన్నైలోని కుంద్రతూర్లో పెట్రోలింగ్ బృందం శనివారం రాత్రి 1 గంట ప్రాంతంలో బస్టాండ్ సమీపంలోని రోడ్డుపై రక్తపుమరకలున్న షర్ట్‌తో రాజా (38) అనే వ్యక్తిని పసిగట్టింది.
పోలీసులు అతడిని ప్రశ్నించగా ప్రియురాలిని హత్య చేసినట్టు అంగీకరించాడు. పోలీసులను హత్య జరిగిన ఇంటికి నిందితుడు తీసుకువెళ్లగా అక్కడ మృతురాలు అర్ధనగ్నంగా రక్తపుమడుగులో పడిఉంది. గత ఐదేండ్లుగా కన్నమ్మ అనే మహిళతో తనకు సంబంధం ఉందని, ఆమె అద్దె ఇంట్లో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో కార్మికురాలిగా పనిచేస్తోందని నిందితుడు వెల్లడించాడు.
శనివారం రాత్రి తప్పతాగిన రాజా కన్నమ్మ ఇంటికి వచ్చి తన కోరిక తీర్చాలని కోరాడు. కన్నమ్మ అందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కన్నమ్మ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి రావడంతో రాజా పరారయ్యాడు. మళ్లీ అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చిన రాజా ఆమెపై కత్తిపోట్లతో విరుచుకుపడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.