చండీగఢ్: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక వ్యక్తి తనకు తానే కిడ్నాప్ అయ్యాడు. భార్యను రెండు లక్షలు డిమాండ్ చేశాడు. అయితే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి డ్రామా బయటపడింది. ఢిల్లీ సమీపంలోని హర్యానాకు చెందిన గురుగ్రామ్‌లో ఈ ఘటన జరిగింది. రాజీవ్‌నగర్‌లో నివాసం ఉండే దీపిక ఈ నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త అనూప్ యాదవ్‌ను సిటీ క్లబ్ నుంచి ఎవరో కిడ్నాప్ చేశారని, క్షేమంగా విడిచిపెట్టేందుకు రెండు లక్షలు డిమాండ్ చేసినట్లు చెప్పింది.
కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో అనూప్ లొకేషన్‌ను గుర్తించారు. మనేసర్‌లో ఉన్న అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు. తాను చాలా మందికి డబ్బులు బాకీ పడ్డానని, వారి నుంచి ఒత్తిడి వస్తున్నదని తెలిపాడు. అప్పుల నుంచి బయటపడేందుకు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు చెప్పాడు. అయితే తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తుందని ఊహించలేకపోయానంటూ విచారం వ్యక్తం చేశాడు.