న్యూఢిల్లీ: ఒక వ్యక్తి నాలుగు లీటర్ల పాల ప్యాకెట్లను దొంగిలించాడు. దీంతో షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. గోవింద్‌పురి నవ్ జీవన్ క్యాంప్ ప్రాంతానికి చెందిన 24 ఏండ్ల రాజ్ కుమార్ ఇటీవల పాల దొంగతనానికి పాల్పడ్డాడు. కల్కాజీ ప్రాంతంలో ఒక పాపు బయట ప్లాస్టిక్ బాక్స్‌లో ఉన్న పాల ప్యాకెట్లను అతడు చోరీ చేశాడు. అనంతరం రాజ్ కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. గమనించిన షాపు యజయాని రాజీవ్ కుమార్ కనోజియా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడు రాజ్ కుమార్‌ను గుర్తించారు. అనంతరం అతడ్ని అరెస్ట్ చేసి దొంగిలించిన నాలుగు లీటర్ల పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, పాల చోరీ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. చిన్న చోరీ ఘటనపై షాపు యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకుని పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడంపై స్థానికులు చర్చించుకున్నారు.