చెన్నై : పెండ్లయి ఒక బిడ్డకు తండ్రిగా ఉన్నా రెండో పెండ్లికి సిద్ధమైన ప్రబుద్ధుడు తన కాబోయే భార్యకు అనుమానం రాగా కవల సోదరుడు అంటూ కలరింగ్ ఇచ్చిన ఘటన చెన్నైలో వెలుగుచూసింది. నిందితుడిని వలందర్ బెనెట్ ర్యాన్గా గుర్తించారు. ర్యాన్కు మొదటి పెండ్లి ద్వారా ఓ బిడ్డ ఉన్నా ఆ విషయం దాచి మరో యువతితో రెండో పెండ్లికి సిద్ధమై నిశ్చితార్ధం చేసుకున్నాడు.
నిశ్చితార్ధం సమయంలో ఆమె కుటుంబ సభ్యుల నుంచి రూ 3.5 లక్షల కట్నం తీసుకున్నాడు. అరుబాక్కంకు చెందిన ర్యాన్ (30) గతంలో తన కొలీగ్ అయిన యువతి (21)తో మొదటి పెండ్లి విషయం దాచి నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఉమ్మడి స్నేహితుడి ద్వారా ర్యాన్కు ఇప్పటికే పెండ్లయి ఓ బిడ్డ ఉన్న విషయం తెలిసి ఆమె నిలదీయగా తనకు వివాహం కాలేదని తన కవల సోదరుడికి వివాహమై కుటుంబంంతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడని నమ్మబలికాడు.
కవల సోదరుడి కహానీకి బలం చేకూర్చేందుకు నకిలీ ఆధార్, వోటర్ ఐడీ కార్డు, బర్త్ సర్టిఫికెట్ను సృష్టించాడు. మహిళ బంధువు సైతం ర్యాన్కు అంతకుముందే పెండ్లయి సంతానం కూడా ఉందని చెప్పడంతో యువతి అతడిని నిలదీసింది. తాము చెల్లించిన కట్నం డబ్బు వెనక్కిఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆమెపై యాసిడ్ దాడి చేస్తానని నిందితుడు బెదిరించడంతో ర్యాన్, ఆమె తల్లిపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.