లక్నో: కుమార్తెను హత్య చేసిన కేసులో జైలుకెళ్లిన ఒక వ్యక్తి కరోనా సమయంలో పెరోల్‌పై బయటకు వచ్చాడు. తిరిగి జైలుకు వెళ్లకుండా తప్పించుకునేందుకు ఒక ప్లాన్ వేశాడు. మరో హత్య చేసి ఆ మృతదేహం తనదిగా నమ్మించే ప్రయత్నం చేశాడు. అది పారకపోవడంతో ఆ వ్యక్తితోపాటు సహకరించిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది.
నవంబర్ 20న నిర్మాణుష్య ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడి ముఖం కాలి ఉండటంతో మృతుడ్ని గుర్తించలేకపోయారు. దుస్తులను తనిఖీ చేయగా సుదేష్ పేరుతో ఆధార్ కార్డ్ ఉన్నది. అందులోని సమాచారం ఆధారంగా మృతదేహాన్ని అతడి భార్యకు పోలీసులు చూపగా తన భర్తే అని ఆమె చెప్పింది.
మరోవైపు, సుదేష్ బతికే ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడి ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అతడిని పోలిన వ్యక్తి ఒక సైకిల్‌పై మృతదేహాన్ని తీసుకెళ్తున్నట్లుగా ఉన్న ఫుటేజ్‌ను గుర్తించారు. అలాగే సుదేష్ తన భార్యను కలిసేందుకు వచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఇంటిపై రైడ్ చేసి అతడ్ని పట్టుకున్నారు.
సుదేష్ను పోలీసులు ప్రశ్నించగా అసలు విషయాన్ని బయటపెట్టాడు. 2018లో 13 ఏండ్ల కుమార్తెను హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లినట్లు తెలిపాడు. కరోనా సమయంలో పెరోల్‌పై బయటకు వచ్చినట్లు చెప్పాడు. అయితే, పెరోల్ గడువు ముగుస్తుండటంతో తిరిగి జైలుకు వెళ్లకుండా, కుమార్తె హత్య కేసులో విధించే శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఒక ప్లాన్ వేసినట్లు వివరించాడు.
ఇంటిలో పని కోసమంటూ ఒక కూలీని రప్పించానని, అతడికి మద్యం తాగించి మంచం కోడుతో తలపై బాది హత్య చేసినట్లు సుదేష్ పోలీసులకు తెలిపాడు. అనంతరం అతడి ముఖాన్ని కాల్చి ఆ మృతదేహాన్ని పడేసి తనదిగా నమ్మించేందుకు ప్రయత్నించినట్లు చెప్పాడు. దీంతో సుదేష్తోపాటు కుట్రలో అతడికి సహకరించిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు కూలీ వ్యక్తి కనిపించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నవంబర్ 20న లభించిన మృతదేహాన్ని పోలీసులు వారికి చూపించగా తమ వ్యక్తేనని గుర్తించారు. కాగా, ఈ హత్య కేసును తెలివిగా ఛేదించిన పోలీస్ బృందాన్ని ఘజియాబాద్ రూరల్ ఎస్పీ ఇరాజ్ రాజా అభినందించడంతోపాటు రివార్డు కూడా ప్రకటించారు.