థానే: భార్య ఆరు నెలల గర్భిణి. కానీ, భర్త రెండో పెండ్లి విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరుగడంతో ఆగ్రహానికి లోనైన భర్త శనివారం సాయంత్రం భార్యపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. ఆ తర్వాత పారిపోయాడు. మహారాష్ట్రలోని థానే జిల్లా కల్వా ఏరియాలోగల మఫత్లాల్ కాలనీలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మఫత్లాల్ కాలనీకి చెందిన అనిల్ బహదూర్ చౌరాసియా.. భార్య ఉండగానే మరో మహిళను పెండ్లి చేసుకున్నాడు. దాంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత నెల 30న అనిల్ బహదూర్ భార్యతో గొడవపడ్డాడు. ఆవేశంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. మంటల్లో చిక్కుకున్న బాధితురాలి అరుపులు విని అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
వెంటనే ఆమెను పరీక్షించిన వైద్యులు బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. కాలిన గాయాల కారణంగా ఆమె కడుపులోని బిడ్డ చనిపోవడంతో సర్జరీ చేసి పిండాన్ని తొలగించినట్లు వెల్లడించారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం కేసు నమోదు చేశారు.