Love Affair | భోపాల్ : ఓ పోలీసు కానిస్టేబుల్ దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రియురాలితో పాటు ఆమె తండ్రిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ షాజాపూర్ జిల్లాలోని బెర్చ్చా పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సుభాష్ ఖరాడీ అనే పోలీసు కానిస్టేబుల్ దివాస్ పోలీసు లైన్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో తన ప్రియురాలి నివసిస్తున్న మాలిఖేడీ గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ తన ప్రియురాలితో పాటు ఆమె తండ్రిపై తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ప్రియురాలు తీవ్రంగా గాయపడగా, ఆమె తండ్రి అక్కడికక్కడే చనిపోయాడు. ఇక కానిస్టేబుల్ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరిద్దరి మధ్య ప్రేమ విషయంలో చోటు చేసుకున్న విబేధాల కారణంగానే కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.